
ఒక్క రోజులోనే రూ. 40 వేల కోట్లు వచ్చాయి
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీయీవో మార్క్ జూకర్బర్గ్ సంపద ఒక్క రోజులోనే దాదాపు 40 వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఫేస్బుక్ కంపెనీ షేర్ల విలువ 13 శాతం పెరగడంతో ఆయన సంపద విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో జూకర్బర్గ్.. ఆయిల్ మేగ్నట్స్ చార్లెస్, డేవిడ్ కోచ్లను వెనక్కినెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లారు.
గురువారం కంపెనీ నాలుగో త్రైమాసిక అమ్మకాలు 52 శాతం పెరిగినట్టు ఫేస్బుక్ వెల్లడించింది. తాజాగా పెరిగిన సంపదతో కలిపి జాకర్బర్గ్ ఆస్తి విలువ 3.22 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రపంచ కుబేరుల జాబితా టాప్-5లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (5.29 లక్షల కోట్ల రూపాయలు), జరా వ్యవస్థాపకుడు అమెన్కియో (4.73 లక్షల కోట్ల రూపాయలు), ఒరాకిల్ ఆప్ ఒమాహా వారెన్ బఫెట్ (4.03 లక్షల కోట్ల రూపాయలు), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (3.78 లక్షల కోట్ల రూపాయలు), టెలికామ్ మేగ్నెట్ కార్లోస్ హెలు (3.22 లక్షల కోట్ల రూపాయలు) ఉన్నారు. వీరి తర్వాతి స్థానంలో జూకర్ బర్గ్ నిలిచారు.