ఫేస్ మాస్క్ లేకుండా చైనాలో జుకర్‌బర్గ్
బీజింగ్: ప్రపంచ దేశాల్లో రోజుకో మైలు చొప్పున పరుగెత్తడం వ్యక్తిగత లక్ష్యంగా పెట్టుకున్న ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ చైనాలోని తియానన్మెన్ స్క్వేర్‌ను సందర్శించడం, అక్కడ తాను పరుగెత్తుతున్న దృశ్యాన్ని అక్కడి నుంచే పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది.
ఫేస్‌బుక్‌ను నిషేధించిన దేశంలో దాని అధిపతి పర్యటించడమా? అని కొంతమంది విమర్శలు చేయగా, 26 ఏళ్ల క్రితం వేలాది మంది విద్యార్థులను ట్యాంకులతో తొక్కించిన తియానన్మెన్ స్క్వేర్‌ను సందర్శించడం ఏమిటని మరి కొంతమంది విమర్శలు సంధించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ప్రజలను కస్టమర్లను చేసుకోవడం కోసం జుకర్‌బర్గ్ చైనా ప్రభుత్వం గడ్డికరుస్తున్నారని ఇంకొంతమంది కామెంట్ చేశారు. ప్రపంచ కాలుష్య నగరాల్లో నెంబర్ వన్‌గా నిలిచినా బీజింగ్‌లో ముఖానికి మాస్క్ కూడా లేకుండా తిరుగుతున్నావా? అంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు.
‘ఒకప్పుడు అందరూ వదిలేసిన నగరంలో నేడు నేను పరుగెత్తాను. ఇది నా వందో మైలు కావడం కూడా విశేషమే. నా వెంట ఇక్కడ, ప్రపంచంలో నాతో కలసి పరుగెత్తిన వారికి ధన్యవాదాలు. తియానన్మెన్ స్క్వేర్‌లో పరుగెత్తడం ద్వారా నా చైనా పర్యటన ప్రారంభమైంది’ అంటూ జుకర్‌బర్గ్ శుక్రవారం నాడు ఫేస్‌బుక్‌లో తన ఫొటోతోపాటు కామెంట్ పోస్ట్ చేశారు. తన పోస్ట్ పై వచ్చిన కామెంట్లలో కొన్నింటికి మాత్రమే జుకర్‌బర్గ్ సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా విమర్శలను పట్టించుకోలేదు. ఓ కమ్యూనిస్టు దేశంతో ఐడెంటిఫై అవుతావా అంటు కూడా విమర్శలు వచ్చాయి.
జుకర్‌బర్గ్ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఈ సారి పర్యటనపై మాత్రం ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆయన గతేడాది సియాటిల్‌లో చైనా అధ్యక్షుడు గ్సీ జింగ్‌పింగ్‌ను కూడా కలుసుకున్నారు. చైనాలో ఫేస్‌బుక్‌ను నిషేధించినప్పటికీ అక్కడి కస్టమర్లను ఆకర్శించడం జుకర్‌బర్గ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన గతేడాది ఆండ్రాయిడ్ యాప్‌లో మార్పులు కూడా తీసుకొచ్చారు.