కుటుంబాన్ని కాపాడిన వెనుక సీటు
తైపీ:తైవాన్ కు చెందిన విమానం ప్రమాదం జరిగే కొద్ది నిమిషాలకు ముందు ఓ కుటుంబం సీట్లు మారడంతో ప్రాణాలతో బయటపడిన ఘటన ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే.. లింగ్ మింగ్ కుటుంబం విహారయాత్ర కోసం ట్రాన్స్ ఏసియా విమానంలో బయలుదేరింది. అయితే వారి కూర్చున్న సీటు దగ్గర ఇంజన్ శబ్ధం చిరాకు తెప్పించడంతో వెనుక వైపు ఉన్న ఖాళీగా ఉన్న సీట్లను లింగ్ గమనించాడు. తమ సీట్లను ఖాళీగా ఉన్న వెనుక సీట్లోకి మార్చవలసిందిగా క్యాబిన్ స్టాఫ్ని కోరి అక్కడికి వెళ్లి కూర్చున్నారు.
ఈ క్రమంలోనే బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫై ఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి నదిలో నడిపోయింది. కూలిన విమాన శిథిలాల మధ్య నుంచి లింగ్ బయటకి వచ్చాడు. అంతే మరు క్షణమే తన కుమారుడి కోసం వెతకడం ప్రారంభించాడు. మూడు నిమిషాల తర్వాత తన కొడుకుని కనుగొన్నాడు. కానీ అప్పటికే అతని శ్వాస పూర్తిగా ఆగిపోయింది. అంతే వెంటనే లింగ్ తన కుమారునికి నోటి ద్వారా గాలి అందించడం ప్రారంభించాడు. అతని ప్రయత్నం ఫలించింది. తన కొడుకు తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెనుక సీట్లలో కూర్చోవడంతోనే వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే ప్రమాదంలో గాయాలతో బయట పడ్డ లింగ్ భార్య కూడా ఆస్సత్రిలో చికిత్స పొందుతుంది. 'నాకున్న ఒక్కగానొక్క కోడుకు, వాడి ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత నా పై ఉంది' అని సంఘటన అనంతరం లింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.