'యాపిల్' తో పనిలేకుండా ఐఫోన్ అన్లాక్?
కాలిఫోర్నియా : ఇక యాపిల్ ఐ ఫోన్ అన్లాక్ వివాదం ముగిసే అవకాశం కనిపిస్తోంది. శాన్ బెర్నార్డినోలో దాడికి పాల్పడిన ఉగ్రవాది వాడిన ఫోన్ ను అన్లాక్ చేసేందుకు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ థర్డ్ పార్టీ సహకారం తీసుకోబోతోంది. సెల్ ఫోన్లో సమాచారం తెలుసుకునేందుకు సహకరించాలంటూ ఇంతకు ముందు ఎఫ్బీఐకు సహకరించాలని అమెరికా ప్రభుత్వం ఆపిల్ కంపెనీని కోరింది. అయితే కంపెనీ అందుకు నిరాకరించడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషనలో భాగంగా థర్డ్ పార్టీ సహకారం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్ను స్వాధీనం చేసుకున్న ఎఫ్బీఐ ఆ ఫోన్ అన్లాక్ చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. ఫోన్ అన్లాక్ చేస్తే వినియోగదారుల భద్రతకు ముప్పు కలుగుతుందని భావిస్తున్న యాపిల్ సంస్థ అందుకు నిరాకరించడంతో దీనిపై కోర్టులో న్యాయ పోరాటం జరుగుతోంది. శాన్ బెర్నార్డినో దాడుల్లో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు వాడిన ఐఫోన్ను అన్లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ సేవలు పొందబోతున్నట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ప్రకటించడంతో ఇక ఐఫోన్ అన్లాక్ సమస్య వివాదం సమసిపోయేట్లు కనిపిస్తోంది.
అన్లాక్ చేసేందుకు ఓ థర్డ్ పార్టీ సహకరించేందుకు ముందుకు రావడంతో కేసు విచారణ వాయిదా వేయాలని ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అభ్యర్థనను అనుమతించిన కాలిఫోర్నియాలోని రివర్సైడ్ ఫెడరల్ కోర్టు మెజిస్ట్రేట్ జడ్జి షెరి పిమ్... ఇవాళ (మంగళవారం) నిర్వహించవలసిన విచారణను వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేశారు. తదుపరి వాయిదా లోపు కొత్త పద్ధతిని ఉపయోగించి ఐఫోన్ అన్లాక్ చేసేందుకు థర్డ్ పార్టీతో కలసి ఎఫ్బీఐ ప్రయత్నిస్తుంది.