
ఒబామా మాటలతో గుండెపోటు:ఫిడెల్ క్యాస్ట్రో
హవానా: అమెరికా అంటే అణువణువున, నరనరాన ద్వేషంతో రగలిపోయే క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రో గతవారం అమెరికా అధ్యక్షుడు ఒబామా క్యూబా పర్యటనపై నిప్పులు చెరిగారు. ఒబామావన్నీ తేనేపూసిన మాటలని, ఆయన మాటలు వింటుంటే క్యూబా ప్రజలకు గుండెపోటు ప్రమాదం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. క్యూబా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేందుకు, బలహీన పర్చేందుకు అమెరికా పన్నిన కుట్రలు, కుతంత్రాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒబామా పర్యటన గురించి అధికార పత్రికలో సోమవారం నాడు తన కాలంలో ‘బ్రదర్ ఒబామా’ శీర్శికన ఫిడెల్ కాస్ట్రో విమర్శల వర్షం గుప్పించారు.
క్యూబాకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా పన్నిన కుట్రల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆర్థిక ప్రతిష్టంబన ఎలా చేసిందో, దేశంలో విప్లవ తిరుగుబాట్లను ఎలా ప్రోత్సహించిందో, రాజకీయ నేతల హత్యలకు ఎలా కుట్రపన్నిందో వివరించారు. వందసార్లకు పైగా తనను హత్య చేసేందుకు అమెరికా చేసిన విఫలయత్నాలను ఆయన మరచిపోయినట్లు లేదు. క్యూబా ప్రజలు తెలివితేటలుగల ప్రజలని, వారికి కష్టించి పనిచేయడం తెలుసని, వారు ఆహారాన్ని సముపార్జించుకోవడంతోపాటు దేశాభివృద్ధికి పాటుపడగలరని అన్నారు. తమ దేశస్థులకు ఎవరూ నీతులు చెప్పాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా యూరప్ ప్రవచనాలు తమకు అవసరమే లేదని అన్నారు.
అమెరికా సిట్టింగ్ ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ క్యూబాలో పర్యటించిన 88 ఏళ్ల తర్వాత మరో సిట్టింగ్ ప్రెసిడెంట్‌గా క్యూబాలో ఒబామా మొదటిసారి పర్యటించారు. ఆయన మూడు రోజులపాటు దేశంలో పర్యటించినప్పటికీ 89 ఏళ్ల విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రోను మాత్రం మర్యాదపూర్వకంగా కూడా కలసుకోలేదు. ఆయన సోదరుడు, ప్రస్తుత దేశాధ్యక్షుడు రాహుల్ క్యాస్ట్రోను మాత్రం పలుసార్లు కలసుకున్నారు. ఇరుదేశాలు దశాబ్దాల శత్రుత్వాన్ని విడనాడాలని, ఓ కుటుంబంలా, ఇరుగుపొరుగులాగా, మిత్రుల్లా కలసిపోవాలని ఒబామా తన పర్యటన సందర్భంగా క్యూబాకు పిలుపునిచ్చారు. ఇవన్నీ తేనే పూసిన మాటలేనని ఫిడెల్ క్యాస్ట్రో కొట్టిపారేశారు.
ఈ విమర్శలను మీడియా అమెరికా వైట్‌హౌస్ దృష్టికి తీసుకెళ్లగా, ఒబామా పర్యటన క్యూబా ఎంతటి ప్రభావాన్ని చూపాయో ఫిడెల్ క్యాస్ట్రో ప్రతిస్పందనే సూచిస్తోందని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ వ్యాఖ్యానించారు. ఒబామాకు రాహుల్ కాస్ట్రో నుంచి క్యూబా అధికారుల నుంచి ఘన స్వాగతం లభించిందని చెప్పారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు ఒబామా పర్యటన దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.