కాల్పులు జరిగే సమయానికి పాకిస్థాన్ లోని ఆర్మీ స్కూల్లో నాలుగో పీరియడ్ జరుగుతున్నట్లు వెనక గేటు నుంచి తప్పించుకుని వచ్చిన ఓ విద్యార్థి చెప్పాడు.
కాల్పులు జరిగే సమయానికి పాకిస్థాన్ లోని ఆర్మీ స్కూల్లో నాలుగో పీరియడ్ జరుగుతున్నట్లు వెనక గేటు నుంచి తప్పించుకుని వచ్చిన ఓ విద్యార్థి చెప్పాడు. తొలుత ఏం జరిగిందో తమకు తెలియలేదని, తర్వాత మమ్మల్ని వెనక గేటు నుంచి పారిపోవాల్సిందిగా ఓ ఆర్మీ అధికారి చెప్పారని అన్నాడు. ఇక పాక్ స్కూలు వద్ద ఇప్పటికీ ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ వర్గాలకు, లోపలున్న ఉగ్రవాదులకు మధ్య భీకర పోరాటం జరుగుతోంది. ముగ్గురు ఫిదాయీ ఉగ్రవాదులను సైనికులు హతమార్చినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో కేవలం నలుగురు పిల్లలు మాత్రమే మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఉగ్రవాదులు లోపలకు వెళ్లీ వెళ్లగానే విద్యార్థులు, ఉపాధ్యాయుల మీద విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. సుమారు 20 మంది వరకు మరణించారు. ఉగ్రవాదుల్లో ఆత్మాహుతి దళ సభ్యులు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. స్కూలు లోపల నుంచి భారీస్థాయిలో కాల్పుల శబ్దాలు వినిపించాయని సంఘటన స్థలంలో ఉన్న రాయిటర్స్ విలేకరి ఒకరు తెలిపారు. స్కూల్లోకి తొలుత 800 మంది వరకు విద్యార్థులు వెళ్లారని, అయితే కొంతమందిని మాత్రం ఎలాగోలా బయటకు తీసుకురావడంతో లోపల సుమారు 500 మంది వరకు ఉండొచ్చని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.