జకార్తా : విహారయాత్రలో భాగంగా స్కూల్ విద్యార్థులతో కలిసి టీచర్లు నదీ తీరం వెంట పాదయాత్ర చేస్తుండగా ఒక్కసారిగా వరద ఎగిసి పడడంతో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఇండోనేషియా ప్రధాన ద్వీపమైన జావా ఐలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. 250 మంది జూనియర్ హైస్కూల్ విద్యార్థుల బృందం, కొంత మంది టీచర్లతో కలిసి స్లెమాన్ జిల్లాలోని యోగ్యకర్త ప్రావిన్స్‌లో నిర్వహించిన స్కౌటింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి జావాలోని సెంపోర్ నదీ తీరానికి వెళ్లిన విద్యార్థులు టీచర్లతో పాదయాత్ర చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
కాగా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి ఎగస్ విబోబో మాట్లాడుతూ.. ప్రసుత్తం జావా ఐలాండ్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, నదీ తీరం వద్దకు ఎవరు వెళ్లవద్దని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సెంపోర్ నదిలో వరద ఉదృతి పెరగడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. కాగా వరద వచ్చిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఆరు మృతదేహాలు కనుగొన్నామని స్థానిక మిలటరీ చీఫ్ డియాంటారో పేర్కొన్నారు. గాయాలతో చికిత్స పొందుతున్న 10 మందితో సహా 239 మంది విద్యార్థులను రక్షించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment