
ఫ్లైట్‌లోని ఓ దృశ్యం
వియన్నా : కొన్ని మనకు చెప్పి రావు. ఎంత నియంత్రించుకున్న అలాంటి వాటి విషయంలో మనమేం చెయ్యగలిగింది ఏం లేదు. సరిగ్గా అలాంటి సమస్యతో బాధపడుతున్న ఓ పెద్దాయన ఇక్కడ విమానంలో రచ్చ రచ్చ రేపాడు. పదే పదే గ్యాస్ వదులుతున్నాడంటూ ఓ వ్యక్తితో ప్రయాణికులు గొడవకు దిగగా.. ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ జట్టు పీకున్నాడు.
డచ్ ఎయిర్ లైన్స్ ట్రాంసవియాకు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి అమస్టర్‌డామ్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే జీర్ణకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ ప్రయాణికుడు పదే పదే ‘గ్యాస్’ వదులుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలిగించింది. అదే వరుసలో కూర్చున్న ఇద్దరు మహిళలతోపాటు మరో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందికి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆ నలుగురు సదరు పెద్దాయనతో గొడవకు దిగారు.
ఈ వ్యవహారంతో ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ వియన్నాలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. గొడవ పడ్డ నలుగురిని దించేసి.. ఆపై ఫ్లైట్ తిరిగి బయలుదేరినట్లు సమాచారం. అక్కడి నుంచి వారిని ప్రత్యామ్నయ మార్గంలో అమస్టర్‌డామ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత గొడవకు కారణమైన ఆ వ్యక్తిని తిరిగి ఫ్లైట్ ఎక్కించుకున్నారా? లేక అతన్ని కూడా దించేశారా? అన్న దానిపై స్పష్టత కొరవడింది.