పాత నోట్ల మార్పిడిలో హైటెక్ మాయాజాలం | Don’t cancel tickets booked with old notes: Government to airlines | Sakshi
Sakshi News home page

పాత నోట్ల మార్పిడిలో హైటెక్ మాయాజాలం

Published Fri, Nov 11 2016 12:26 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

పాత నోట్ల మార్పిడిలో హైటెక్ మాయాజాలం - Sakshi

పాత నోట్ల మార్పిడిలో హైటెక్ మాయాజాలం

న్యూ ఢిల్లీ: పాత రూ.500, రూ.1000 నోట్లను మార్పిడి చేయడానికి నల్లకుబేరులు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతోన్న అవినీతిని రూపుమాపే క్రమంలో భాగంగా మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అప్పటి వరకూ మనుగడలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఇబ్బంది పడకూడదని 72 గంటలపాటూ(నవంబర్11 రాత్రి 12 వరకు) కొన్ని సడలింపులను ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వాసుపత్రులు, రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్రభుత్వ బస్సులు, విమానాశ్రయాల్లోని ఎయిర్ లైన్స్ కౌంటర్లలో, ప్రభుత్వ రంగ సంస్థల అధీనంలో నడిచే పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే సహకార కేంద్రాలు, పాల కేంద్రాల్లో.. శ్మశానాల్లోనూ 500, 1,000 నోట్లను స్వీకరించే వెసులుబాటు కల్పించారు.

ఈ నిబంధనను కొందరు నల్లకుబేరులు చాకచక్యంగా తమ దగ్గరున్న నల్లధనమార్పిడికి వాడాలనుకున్నారు. ముందుగా పెద్ద మొత్తంలో ధరలుండే టికెట్లను బుక్ చేసుకోవడం తర్వాత క్యాన్సల్ చేయగడంతో నల్లధనం సునాయాసంగా మార్చవచ్చని భావించారు. అయితే ఎంతో పకడ్బందీగా అవినీతి జాడ్యాలను కూకటివేళ్లతో పెకిలించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఈ ఘరానా మోసాన్ని ఆదిలోనే పసిగట్టింది. పాత నోట్లతో టికెట్లను బుక్ చేసుకున్న వారి టికెట్లను క్యాన్సల్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కౌంటర్ దగ్గర ఎవరైతే పాత 500, 1000 రూపాయల నోట్లతో టికెట్లను బుక్ చేసుకొని క్యాన్సల్ కోసం తిరిగి రిక్వెస్ట్ పెట్టుకుంటారో వారి టికెట్లను రద్దు చేయడం లేదా తమ టికెట్ రుసుమును తిరిగి రిఫండ్ చేయడం సాధ్యంకాదని అన్ని ఎయిర్స్ లైన్స్కు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.  

పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కౌంటర్లలో టికెట్ల బుకింగ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని ఎయిర్‍లైన్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా రోజుకు 20 నుంచి 25 లక్షల రూపాయలు కౌంటర్ బుకింగ్ ద్వారా వచ్చేవని కానీ, 500, 1000రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కౌంటర్లలో రోజుకు కోటిరూపాయల వరకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారని అంటే సాధారణం కంటే ఇది దాదాపు నాలుగు రెట్లు అని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి అజయ్ జస్రా తెలిపారు.

అధికారికంగా ప్రభుత్వంగానీ, డీజీసీఏ నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు రోజుల నుంచి ఎవరైతే కౌంటర్ల దగ్గర పాత 500, 1000రూపాయలతో టికెట్లను కొనుగోలు చేసి క్యాన్సల్ చేసుకుంటారో వారి టికెట్ రుసుము తిరిగి ఇవ్వబోమని ఇప్పటికే కొన్ని ఎయిర్ లైన్స్  ప్రకటించాయి.

విమానయాన సంస్థ విస్టారా గత రెండు రోజుల నుంచి పాత రద్దు చేసిన నోట్లతో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సల్ చేసుకుంటే వాటికి రుసుము రిఫండ్ చేయడం సాధ్యంకాదని ట్విట్టర్లో పేర్కొంది.  టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా విస్టారాను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement