'తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా'
అతని వృత్తి.. మృతదేహాలను ఖననం చేయడం. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఇతర వృత్తుల మాదిరిగా అతనూ పొట్టకూటి కోసం తన పని తాను చేసుకుపోతుంటాడు. బాధ, విచారం వంటి భావోద్వేగాలకు చోటేలేదు. అలాంటి ప్రొఫెషనల్ కాటికాపరి మృతదేహాలను ఖననం చేసేటపుడు తొలిసారి బోరున విలపించాడు. చనిపోయినవారితో ఎలాంటి బంధం లేకపోయినా అతనికి దుఃఖం ఆగలేదు. మృతదేహాలను ఖననం చేయడం తన వృత్తయినా ఆప్తులను కోల్పోయినట్టు బాధపడ్డాడు. పాకిస్థాన్లోని పెషావర్ శ్మశానవాటికలో తాజ్ మహమ్మద్ అనే కాటికాపరికి ఈ విషాదకర పరిస్థితి ఎదురైంది.
పెషావర్ ఆర్మీ స్కూల్పై ఇటీవల జరిగిన ఉగ్రవాదదాడిలో దాదాపు 140 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. చిన్నారుల మృతదేహాలను తాజ్ మహమ్మద్ ఖననం చేశాడు. 'గతంలో చాలా మంది మృతదేహాలను ఖననం చేశాను. వీరిలో విభిన్న వయసు, ఎత్తు, బరువు ఉన్న వారు ఉన్నారు. అయితే ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన చిన్నారుల మృతదేహాలను ఖననం చేస్తున్నప్పుడు చాలా భారంగా అనిపించింది. జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయాను' అని తాజ్ మహమ్మద్ చెప్పాడు. తాజ్ ఇద్దరు కొడుకులు కూడా ఆయనకు తోడుగా పనిచేస్తుంటారు.