gravedigger
-
సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయట!
సమాధులు తవ్వితే ఎముకలొస్తాయి. కానీ... సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయని నమ్ముతున్నారు. ఎక్కడో కాదు.. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా కలకేరిలో కొన్ని రోజులుగా వానలు పడకపోవడంతో చనిపోయినవాళ్ల శాపమేనని నమ్మిన గ్రామస్తులు... గత నెలలో మరణించినవాళ్ల జాబితా తీశారు. వాళ్ల సమాధులకు తల ఎటువైపున్నాయో కుటుంబ సభ్యుల సహాయంతో గుర్తించారు. తలకు రెండు అడుగుల దూరంలో ఓ గుంత తవ్వి చనిపోయిన వాళ్ల నోరువైపుగా పైపు పెట్టి వాటర్ ట్యాంకర్‌తో నీటిని వదిలారు. 25 సమాధులకు అలా నీటిని పోసి, ప్రక్రియ పూర్తి చేసిన కొద్దిసేపటికే వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయట. .3వేల జనాభా ఉన్న కలకేరి గ్రామస్తుల్లో ఈ నమ్మకం కొన్నేళ్ల కిందటే బలపడింది. నోరు తెరిచి చనిపోయిన ఓ వృద్ధుడి నోటిని మూయకుండానే ఖననం చేశారట. అప్పటినుంచి వానలు పడక... గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చిందట. ఓ జ్యోతిష్యుడి దగ్గరకెళ్లి అడిగితే... చనిపోయిన వృద్ధుడి గురించి చెప్పాడట. వెంటనే వెళ్లి అతని సమాధిని తవ్వి నీటిని పోస్తే... వర్షం వచ్చిందట. ఇక అప్పటినుంచి దాన్నే నమ్ముతూ వానలు రానప్పుడల్లా పాటిస్తున్నారు గ్రామస్తులు. ఈ వింత నమ్మకాలు మనదేశంలోనే కాదు..ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. గ్రామంలో వానలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఇటీవల ఓ మెక్సికన్ మేయర్ మొసలినే పెళ్లి చేసుకున్నాడు. చదవండి: మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి షాక్ -
'తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా'
అతని వృత్తి.. మృతదేహాలను ఖననం చేయడం. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఇతర వృత్తుల మాదిరిగా అతనూ పొట్టకూటి కోసం తన పని తాను చేసుకుపోతుంటాడు. బాధ, విచారం వంటి భావోద్వేగాలకు చోటేలేదు. అలాంటి ప్రొఫెషనల్ కాటికాపరి మృతదేహాలను ఖననం చేసేటపుడు తొలిసారి బోరున విలపించాడు. చనిపోయినవారితో ఎలాంటి బంధం లేకపోయినా అతనికి దుఃఖం ఆగలేదు. మృతదేహాలను ఖననం చేయడం తన వృత్తయినా ఆప్తులను కోల్పోయినట్టు బాధపడ్డాడు. పాకిస్థాన్‌లోని పెషావర్ శ్మశానవాటికలో తాజ్ మహమ్మద్ అనే కాటికాపరికి ఈ విషాదకర పరిస్థితి ఎదురైంది. పెషావర్ ఆర్మీ స్కూల్‌పై ఇటీవల జరిగిన ఉగ్రవాదదాడిలో దాదాపు 140 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. చిన్నారుల మృతదేహాలను తాజ్ మహమ్మద్ ఖననం చేశాడు. 'గతంలో చాలా మంది మృతదేహాలను ఖననం చేశాను. వీరిలో విభిన్న వయసు, ఎత్తు, బరువు ఉన్న వారు ఉన్నారు. అయితే ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన చిన్నారుల మృతదేహాలను ఖననం చేస్తున్నప్పుడు చాలా భారంగా అనిపించింది. జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయాను' అని తాజ్ మహమ్మద్ చెప్పాడు. తాజ్ ఇద్దరు కొడుకులు కూడా ఆయనకు తోడుగా పనిచేస్తుంటారు.