
మళ్లీ మళ్లీ భూమి కంపిస్తుండటంతో బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక గుడారాలు ఏర్పాటుచేసుకున్న నేపాలీలు
సోమవారం తెల్లవారు జామున దాదాపు రెండు గంటల ప్రాంతంలో మళ్లీ భూమి కంపిందింది. ఈ తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 3,218కి పెరిగింది.
ఆసియాలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన నేపాల్పై ప్రకృతి ప్రకోపం ఇంకా తగ్గలేదు. శనివారం ప్రారంభమైన భూకంపనలు నేటికీ కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున దాదాపు రెండు గంటల ప్రాంతంలో మళ్లీ భూమి కంపిందింది. ఈ తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 3,218కి పెరిగిందని, దాదాపు 7 వేల మందికిపైగా గాయపడ్డారని స్థానిక పోలీసు అధికారులు ప్రకటించారు. ఇటు భారత్లోనూ మృతుల సంఖ్య 66కు పెరిగిందని అధికారులు చెప్పారు. కఠ్మాండు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్లను విడిచి బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు తరచూ భూమి కంపిస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. భారత సైన్యం, జాతీయ విపత్తు నివారణ సంస్థ సిబ్బందితోపాటు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలమేరకు కేంద్ర హోం శాఖ అదనపు సెక్రటరీ బీకే ప్రసాద్ నేతృత్వంలోని ఇంటర్ మినిస్టీరియల్ టీం సోమవారం ఉదయం నేపాల్ పయనమైంది.
నేపాల్ లో చిక్కుకుపోయిన వారిలో దాదాపు రెండు వేల మందిని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విమానం ద్వారా ఈ రోజు ఉదయం భారత్ కు తరలించారు. ఇంకా వేలమంది భారతీయులు కఠ్మాండు విమానాశ్రయంలో ఎదురుచేస్తున్నారు. ఆదివారం నుంచి నేపాల్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన కఠ్బాండు పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం కూడా భారీ వర్షం కురిసింది.