గాల్లో తేలినట్టుందే ...
విమానంలో వెళ్తున్నప్పుడు ప్రయాణికుల సీటులో కూర్చుని బుల్లి కిటికీలోంచి బయటకు చూస్తే.. వచ్చే అనుభూతి వేరు. మేఘాలు.. అంతా చిన్నచిన్నగా కనిపించడం.. తొలిసారి విమానం ఎక్కినోళ్లయితే.. చిన్నపిల్లల్లా సంబరపడిపోతారు. అదే పెలైట్ సీటులో కూర్చునే చాన్స్ ఇస్తేనే.. అక్కడ్నుంచి వ్యూ అదిరిపోదూ.. ట్రిటాన్ అనే ఈ విమానమొక్కితే.. అలాంటి అరుదైన అనుభూతి మన సొంతమవుతుంది.
ఈ విమానానికి రెండు వైపులా రెండు అదనపు క్యాబిన్లలాంటివి ఉంటాయి. ఒక్కోదానిలో ఐదుగురు వరకూ కూర్చోవచ్చు. వాటిల్లో కూర్చుంటే పైలట్ సీటులో కూర్చున్నట్లు ఉంటుందని.. అన్ని వైపులా అద్దాలే ఉండటంతో అద్భుతమైన అనుభూతి మీ సొంతమవుతుందని దీని డిజైనర్ అమెరికాకు చెందిన మైక్రోనాటిక్స్ సంస్థ చెబుతోంది.
ప్రపంచంలో పేరొందిన పర్యాటక ప్రాంతాల మీదుగా దీన్ని నడపనున్నట్లు ప్రకటించింది. త్వరలో ఈ విమానం తయారీ, ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపింది.