తైవాన్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేలుళ్లు
20 మందికి పైగా మృతి.. 270 మందికి గాయాలు
తైపీ: భూగర్భంలో ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా భారీ పేలుళ్లు సంభవించి.. తైవాన్‌లో 20 మందికిపైగా మరణించగా.. 270 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశ దక్షిణ తీరప్రాంత నగరమైన కావోసియాంగ్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా మొదలైన ఈ పేలుళ్లు.. దాదాపు మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో అర్ధరాత్రి వరకూ జరుగుతూనే ఉన్నాయి.
ఈ గ్యాస్ పైప్‌లైన్ పేలుళ్ల ధాటికి పైన ఉన్న రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. పెద్ద సంఖ్యలో కార్లు ఇళ్లు, దుకాణాలు పాక్షికంగా కూలిపోయాయి.. పేలుళ్లు జరిగిన ప్రాంతమంతా భీతావహంగా మారింది. తైవాన్ అధికారులు ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. గ్యాస్ లీకేజీకి, పేలుళ్లకు కారణాలను పరిశీలిస్తున్నారు.