
చైనా భారీ విన్యాసాలు పూర్తయిన నేపథ్యంలో పరిణామం
తైపీ: తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలకు తావిచ్చే మరో పరిణామమిది. ఆదివారం అమెరికా, కెనడా యుద్ధ నౌకలు చైనా, తైవాన్‌లను విడదీసే తైవాన్ జలసంధిలోకి ప్రవేశించాయి. అమెరికా యుద్ద నౌక యూఎస్‌ఎస్ హిగ్గిన్స్, కెనడా యుద్ధ నౌక హెచ్‌ఎంసీఎస్ వాంకూవర్ ఆదివారం తైవాన్ జలసంధి గుండా ప్రయాణించాయని, తైవాన్ జలసంధి గుండా వెళ్లేందుకు అన్ని దేశాల నౌకలకు స్వేచ్ఛ ఉందని చెప్పడమే తమ ఉద్దేశమని సోమవారం అమెరికా నేవీకి చెందిన ఏడో ఫ్లీట్ తెలిపింది. తైవాన్ భూభాగం తమదేనంటూ వారం క్రితం చైనా భారీ యుద్ధ విన్యాసాలతో ఆ దేశాన్ని పూర్తి స్థాయిలో దిగ్బంధించడం తెలిసిందే.
గత నెలలో జర్మనీకి చెందిన రెండు యుద్ధ నౌకలు తైవాన్ జలసంధిలో ప్రయాణించాయి. కాగా, తాజాగా అమెరికా, కెనడాల చర్యను చైనా ఖండించింది. తైవాన్ అంశం స్వేచ్ఛా నౌకాయానానికి సంబంధించింది కాదు, తమ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు సంబంధించిన వ్యవహారమని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా, కెనడా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధిలోకి ప్రవేశించడం ఈ ప్రాంత శాంతి, సుస్థిరతలకు భంగకరమని చైనా మిలటరీ వ్యాఖ్యానించింది. అవి జలసంధిలో ఉన్నంత సేపు వాటిని పరిశీలించేందుకు తమ వైమానిక, నౌకా బలగాలను అక్కడికి తరలించామని వివరించింది.