'యాపిల్' వార్తలపై బిల్ గేట్స్ అసంతృప్తి
వాషింగ్టన్: యాపిల్ సంస్థతో కొనసాగుతున్న వివాదంలో తాను ఎఫ్ బీఐకు మద్దతు తెలిపినట్టు వచ్చిన వార్తలపై మైక్రోసాఫ్ట్ అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని మీడియా కచ్చితంగా వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. 'ప్రభుత్వం చేసే ప్రతిపనిని ఎవరూ సమర్థించరు. సర్కారు గుడ్డిగా వ్యవహరిస్తే ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు' అని 'బ్లూమ్ బర్గ్ గో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ అన్నారు.
వాషింగ్టన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని యాపిల్ సంస్థ తెలిపిందని, ఈ అంశాన్ని ప్రజలకు మధ్యకు తీసుకెళ్లి చర్చించడానికి ఇదే సరైన సమయని అభిప్రాయపడ్డారు. శాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ కు చెందిన ఐఫోన్ ను తెరిచే వ్యవహారంలో బిల్ గేట్స్.. ప్రభుత్వం తరపున నిలబడ్డారని అంతకుముందు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
ఈ ఐఫోన్ ను తెరిచేందుకు విఫలయత్నం చేసిన ఎఫ్ బీఐ అధికారులు.. యాపిల్ సంస్థ సాయాన్ని కోరుతూ వాషింగ్టన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఎఫ్‌బీఐకి సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఇందుకు యాపిల్ నిరాకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఐఫోన్ తెరవబోమని స్పష్టం చేసింది. యాపిల్ నిర్ణయాన్ని టెక్నాలజీ దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సమర్థించాయి.