
యాపిల్‌ను వెనకేసుకొచ్చిన పిచాయ్
ఐఫోన్ యూజర్ల వ్యక్తిగత ప్రైవసీ విషయమై ఎఫ్‌బీఐ, యాపిల్ సంస్థకు మధ్య జరుగుతున్న పోరాటంపై గూగుల్ సీఈవో, భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ స్పందించారు. ఉగ్రవాది సయెద్ ఫరూఖ్ ఐఫోన్ యాక్సెస్‌ను ఎఫ్‌బీఐకి ఇవ్వడానికి యాపిల్ నిరాకరించడాన్ని ఆయన సమర్థించారు. ఈ సందర్భంగా గతంలో యాపిల్ సీఈవో టిమ్ కూక్ ప్రచురించిన యాపిల్ ప్రైవసీ లేఖను సుందర్ పిచాయ్ ప్రస్తావించారు. ఉగ్రవాది ఐఫోన్ యాక్సెస్ ఇవ్వాలంటూ అమెరికా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు భవిష్యత్తులో అసాధారణ సమస్యాత్మక పరిస్థితులకు దారితీయవచ్చునని పిచాయ్ అభిప్రాయపడ్డారు.
వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచే ఎన్‌క్రిప్షన్ రక్షణ చర్యలు ఐఫోన్ మాదిరిగా ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను పర్యవేక్షించే గూగుల్ సంస్థ కూడా ఈ చర్చలోకి ప్రవేశించడం చాలా కీలకంగా మారింది. మొబైల్ ఫోన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచాల్సిందేనన్న యాపిల్ నిర్ణయానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మద్దతు పలికారు.
'మీ సమాచారానికి పూర్తి భద్రత కలిగించే ఉత్పత్తులను మేం రూపొందిస్తున్నాం. అయితే ఈ విషయంలో చట్టబద్ధమైన ఆదేశాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఈ డాటా యాక్సెస్‌ను ఇస్తాం' అని మొదట ట్వీట్ చేసిన పిచాయ్ ఆ వెంటనే 'అయితే వినియోగదారుడి పరికరాన్ని హ్యాక్ చేసి.. అందులోని సమాచారాన్ని ఇవ్వమనడం మాత్రం అందుకు పూర్తి విరుద్ధమే' అని మరో ట్వీట్ లో తేల్చిచెప్పారు. హ్యాకింగ్ చేయాలంటూ కంపెనీలను బలవంత పెట్టడం వినియోగదారుల ప్రైవసీ విషయంలో రాజీపడటమే అవుతుందని, ఈ కీలక విషయంలో బహిరంగ చర్చ జరుగాల్సి ఉందని పిచాయ్ స్పష్టం చేశారు. మరోవైపు విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడన్ కూడా యాపిల్ సంస్థకు మద్దతు పలికారు. పౌరుల వ్యక్తిగత విషయాల్లోకి చొరబడేవిధంగా ఉన్న ఎఫ్‌బీఐ తీరును వ్యతిరేకిస్తున్న యాపిల్ ను ఆయన కొనియాడారు.