డబ్లిన్‌లో వాకౌట్ చేసిన ఉద్యోగులు
సింగపూర్/న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులు గురువారం ఆ సంస్థకు షాక్ ఇచ్చారు. మహిళా ఉద్యోగులపై లైంగికవేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల విషయంలో సంస్థ పక్షపాతంతో వ్యవహరించడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు వాకౌట్ నిర్వహించారు. తొలుత జపాన్ రాజధాని టోక్యోలో ఉదయం 11.10 గంటలకు గూగుల ఉద్యోగులు అందరూ కంపెనీ నుంచి బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం అమెరికా, భారత్, స్విట్జర్లాండ్, సింగపూర్, బ్రిటన్ సహా పలుదేశాల్లోని వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఉదయం 11.10కు(స్థానిక కాలమానం ప్రకారం) కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. ఆండ్రాయిడ్ ఓఎస్ సృష్టికర్త ఆండీ రూబిన్, డైరెక్టర్ రిచర్డ్ డీవౌల్ సహా కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై గూగుల్ దశాబ్దకాలం పాటు మౌనం పాటించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల సంచలన కథనాన్ని ప్రచురించింది. కాగా, వేధింపులపై కోర్టును ఆశ్రయించేలా నిబంధనల్లో సవరణ, స్త్రీ–పురుషులకు సమాన వేతనం, కంపెనీ బోర్డులో తగిన ప్రాధాన్యం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment