39 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిశారు
సినిమా కథను తలపించేలాగా ఎప్పుడో 39 ఏళ్ల క్రితం విడిపోయిన మనవరాలిని.. బామ్మ మళ్లీ కలుసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని, తన మనవరాలు మళ్లీ తన దగ్గరకు వచ్చిందంటూ క్రిస్మస్ పండగరోజు అర్జెంటీనాకు చెందిన 92 ఏళ్ల మార్లా ఇసాబెల్ చిచా డి మరియాని చెప్పారు.
1976లో మిలటరీ అధికారులు.. మార్లా మనవరాలు క్లారా అనాహి మరియానిని తీసుకెళ్లారు. క్లారా మూణ్నెళ్ల పసిబిడ్డగా ఉన్నప్పుడు సైన్యం ఆ చిన్నారి తల్లిని చంపి ఎత్తుకెళ్లారు. క్లారా కోసం గాలిస్తూ ఆమె తండ్రి డానియల్ 1977లో అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి మార్లా తన మనవరాలి కోసం అన్వేషిస్తోంది. 'గ్రాండ్ మదర్స్ ఆఫ్ ద ప్లాజా డి మయో' అనే మానవహక్కుల సంస్థ విడిపోయిన కుటుంబ సభ్యులను కలిపేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థలో పనిచేసిన మార్లా 1980లో విడిపోయి మనవరాలి పేరుతో క్లారా అనాహి ఫౌండేషన్ను స్థాపించింది.
ఎనిమిదేళ్ల క్రితం మార్లా తన మనవరాలికి బహిరంగం లేఖ రాసింది. 'సైన్యం దాడిలో మరణించావని నన్ను నమ్మించేందుకు ప్రయత్నించారు. నువ్వు బతికేఉన్నావని నాకు తెలుసు. నిన్ను చూసి, ఆప్యాయంగా కౌగిలించుకోవాలన్నదే నా కోరిక' అని లేఖలో పేర్కొంది. అంతేగాక క్లారా తల్లిదండ్రులు వివరాలు, వారి అభిరుచులను లేఖలో రాసింది. సుదీర్ఘ అన్వేషణ అనంతరం మార్లా తన మనవరాలు క్లారాను గుర్తించింది. వీరిద్దరికీ జన్యుపరీక్షలు నిర్వహించగా 99.9 శాతం సరిపోలాయి.