
భవిష్యత్తులో కీటక భోజనమే గతి..!
న్యూయార్క్: నరకంలో నూనెలో కాల్చడం, శూలంతో గుచ్చడం వంటి శిక్షలతోపాటు క్రిమిభోజనం కూడా ఉంటుందని చెబుతుంటారు. అయితే మనం చచ్చి నరకానికి పోకున్నా.. భవిష్యత్తులో కీటక భోజనం తినాల్సిన అవసరం ఏర్పడనుందట. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరువైందని, భవిష్యత్తులో పెరిగే జనాభాకు తీవ్ర ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో)’ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ‘తినదగిన కీటకాలు: భవిష్యత్తులో ఆహార భద్రతకు అవకాశాలు’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ఎఫ్‌ఏవో విరివిగా దొరికే పలు ఆహార వనరులను ప్రస్తావించింది.
కప్పలు, పాములు, కీటకాల వంటివాటిని వివిధ దేశాల్లో రెస్టారెంట్లలో వడ్డించడం ఇప్పటికే ఉంది. అయితే భవిష్యత్తులో ఈ ఎంటమోఫేజీ (ఆరోగ్యం, పర్యావరణ ప్రయోజనాల కోసం కీటకాలను తినడం) మెనూలో గొంగళిపురుగులు, చెదలు, మిడతలు, పురుగుల వంటివాటిని విరివిగా ఉపయోగించవచ్చని ఎఫ్‌ఏవో సూచిస్తోంది. ఈ క్రిమిభోజనం ఎలా ఉంటుందంటే... పురుగులు, కీటకాలను ఉప్పునీటిలో ఉడకబెట్టి, తర్వాత ఎండబెట్టి, వేపుడు చేసి పళ్లెంలో వడ్డించేస్తారు. చెదలను ఎండబెట్టి, అరటి ఆకులలో ఆవిరితో ఉడికించి వడ్డిస్తారు. క్రిమిభోజనంతో ఆకలి తీరడమే కాదండోయ్.. పొటాషియం, సోడియం, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, రాగి, ఇనుము, కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలూ పుష్కలంగా అందుతాయి.