మోగాదిషు: పార్లమెంటు సభ్యులే లక్ష్యంగా సోమాలిలో ఓ హోటల్ కారు బాంబు దాడితో దద్ధరిల్లింది. భారీ ఆయుధాలతో దయాహ్ అనే హోటల్ వద్దకు వచ్చిన దుండగులు తొలుత కాల్పులు జరిపి అనంతరం కారు నిండా బాంబులు పెట్టి అందరూ చూస్తుండగానే పేల్చేశారు. ఈ దాడిలో 10మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా.. 50మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు సైతం వారు చేస్తున్న చర్యను నివారించలేకపోయారు. అయితే, పార్లమెంటు సభ్యులకు ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది.
ఈ ఘటనపై సొమాలి రక్షణశాఖ మంత్రి అబ్దరిజక్ ఒమర్ మహ్మద్ మాట్లాడుతూ నలుగురు దుండగులను పోలీసులు హతమార్చినట్లు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన అల్ షహాబ్ ఈ దాడికి తెగబడినట్లు భావిస్తున్నామన్నారు. తమ దేశ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిర్వహించే పరోక్ష ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను పార్లమెంటు సభ్యులు అదే ప్రాంతంలో ఉండి చర్చించుకుంటున్నారని తెలిసిన దుండగులు అదే మార్గంలో కారులో వెళుతూ ఓ హోటల్ వద్దకు రాగానే ఆ కారును పేల్చేశారని, దాని తర్వాత మరో కారు పేలుడు చోటు చేసుకుందని చెప్పారు. క్షతగాత్రులకు సత్వర సహాయం అందిస్తున్నామని, కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంత చిద్రమయ్యాయని అన్నారు.