బాంబుదాడిలో 22 మంది మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో తీవ్రవాదులు బాంబుదాడికి పాల్పడ్డారు. సోమాలి యూత్ లీగ్(ఎస్వైఎల్) హోటల్ బయట జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో 22 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో హోటల్లో భద్రతా సమావేశం జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశాన్ని లక్ష్యంగా చేసుకొనే దాడి జరిగిందని భావిస్తున్నారు.
బాంబు దాడికి పాల్పడింది తామేనంటూ అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. పేలుడు జరిగిన సోమాలి యూత్ లీగ్ హోటల్.. ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల సమావేశాలకు ఆతిథ్యమిస్తుంది. గతంలోనూ ఈ హోటల్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బాంబుదాడికి పాల్పడిన ఉగ్రవాది రాకను ముందుగానే గుర్తించిన భద్రతా బలగాలు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ విపలమైనట్లు తెలుస్తోంది. అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది.