చెమట వాసనతో ఆరోగ్యం గుట్టు చెబుతుంది...
లండన్: మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు అనేక పరీక్షలున్నాయి. స్మార్ట్‌ఫోన్లు మొదలుకొని ఫిట్‌నెస్ బ్యాండ్ల వరకూ అనేక గాడ్జెట్ల ద్వారా ఈ వివరాలు తెలుసుకుంటున్న కాలమిది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని యూసీ బెర్క్‌లీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పట్టీని అభివృద్ధి చేశారు. ఇది శరీరం నుంచి వెలువడే చెమటను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ కీలకమైన ఆరోగ్య వివరాలు అందిస్తూంటుంది.
ఇందుకోసం తాము ఫ్లెక్సిబుల్ సెన్సరును తయారు చేశామని ఇది చెమటలోని రసాయనాల మోతాదును పసిగడుతుందని అలీ జావే అనే శాస్త్రవేత్త తెలిపారు. శరీరంలోని గ్లూకోజ్, లాక్టేట్, సోడియం, పొటాషియం వంటి రసాయనాలతోపాటు చర్మపు ఉష్ణోగ్రతను ఈ సెన్సర్లు గుర్తించగలవు. ఈ సెన్సర్‌కు అనుసంధానించిన మైక్రోప్రాసెసర్, వైర్‌లెస్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు మన స్మార్ట్‌ఫోన్లకు సమాచారం పంపుతాయన్నమాట. సోడియం, పొటాషియం మోతాదులనుబట్టి మన శరీరాల్లో తగినంత నీరు ఉందా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు. అలాగే లాక్టేట్ ద్వారా మన కండరాలు అలసిపోయాయా? అన్నది గుర్తించవచ్చు.