
హృదయాన్ని మెలిపెట్టే ప్రేమ గాథ
వివాహం ఓ వ్యక్తి జీవితంలో మరపురాని, మధురమైన రోజు. ఇద్దరు వ్యక్తులు ప్రేమతో కలకాలం జీవించేందుకు తోడ్పడే బంధం. మరణించే వరకూ తోడూ.. నీడగా ఉంటానని భరోసా కల్పించే అనుబంధం. ఫిలిప్పైన్స్‌కు చెందిన రౌడెన్ గో కూడా ఇదే కోరుకున్నాడు.. తన జీవితంలోనూ పెళ్లి రోజు మరచిపోలేనిది కావాలనుకున్నాడు.. ఎందుకంటే అతని ఆఖరి కోరిక కూడా ఇదే మరి. రౌడెన్ గో.. అతని భాగస్వామి లెజైల్ మే.. రెండేళ్ల కుమార్తె జాకియా రౌజెల్.. వీరిది ఓ అందమైన కుటుంబం. రౌడెన్ 30వ పుట్టిన రోజైన జూలై 8న పెళ్లిచేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. మనిషి ఓవిధంగా తలిస్తే.. విధి మరోవిధంగా నడిపిస్తుంది. రౌడెన్ ఆశలను తుంచేసే చేదునిజం ఒకటి కొద్ది రోజుల క్రితమే తెలిసింది. అతనికి లివర్ కేన్సర్. అది కూడా స్టేజ్ 4. దీంతో రౌడెన్ ఆస్పత్రికే పరిమితమైపోయాడు. అయితే విధి రాతతో పోరాడేందుకు నిర్ణయించుకున్న రౌడెన్‌గో స్నేహితులు..
కుటుంబ సభ్యులు ఒక్కటై.. అతని ఆఖరి కోరిక తీర్చేందుకు నడుంబిగించారు. తన ప్రేమ చిహ్నమైన లెజైల్‌తో రౌడెన్ పెళ్లిని గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించారు. అయితే ఆస్పత్రిలో ఉన్న రౌడెన్‌ను బయటకు తీసుకొచ్చే దారి లేదు. దీంతో చర్చినే అతని దగ్గరకు తీసుకొచ్చారు. 12 గంటల పాటు కష్టపడి వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లూ చేసి అతని కలను నిజం చేశారు. వీరి పెళ్లి వేడుక సంప్రదాయబద్ధంగా పూర్తయ్యింది. జీవితాంతం నీకు తోడు-నీడగా ఉంటానని రౌడెన్ లెజైల్‌కు బాస చేస్తూ.. ఆమె చేతిని అందుకున్నాడు. అయితే అతని బాస పది గంటల సేపు మాత్రమే నిలిచింది. పెళ్లైన పది గంటలకే రౌడెన్ తుది శ్వాస విడవటం అందరినీ విషాదంలో నింపేసింది. హృదయాన్ని మెలిపెట్లే రౌడెన్-లెజైల్‌ల గాథ ఇప్పుడు యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్. వీరి వీడియోను చూస్తూ.. తమ ప్రేమ సంగతులు నెమరువేసుకుంటున్నారు లక్షలాది మంది. జూన్ 18న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షలమంది చూసేశారు.