గుండెకు వైర్లు లేని పేస్‌మేకర్
విజయవంతంగా అమర్చిన భారతీయ వైద్యుడు వివేక్ రెడ్డి
సంప్రదాయ పేస్‌మేకర్‌కన్నా
10 శాతం చిన్నది
శస్త్రచికిత్స అవసరం లేకుండానే గుండెలో నేరుగా అమర్చవచ్చు
న్యూయార్క్: భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ వివేక్ రెడ్డి అమెరికాలో ఘనత చాటారు. లీడ్లు (వైర్లు) లేని చిన్న పేస్‌మేకర్‌ను ఒక హృద్రోగి గుండెలోపలే నేరుగా అమర్చారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా గజ్జల వద్ద నుంచి ధమని ద్వారా కేథెడర్ విధానంలో ఆ పేస్‌మేకర్‌ను గుండెలోకి పంపించగలిగారు. ఇక్కడి ది మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో ఆ చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ లీడ్లులేని పేస్ మేకర్ సంప్రదాయ పేస్‌మేకర్ కన్నా పది శాతం చిన్నగా ఉంటుంది. సెయింట్ జ్యూడ్ మెడికల్ రూపొందించిన ఈ బుల్లి పేస్ మేకర్ చిన్న సిల్వర్ ట్యూబ్‌ను పోలి ఉంటుంది. ఈ పేస్ మేకర్ గురించి వివేక్ రెడ్డి చెప్పిన విషయాలు..
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సామర్థ్యం, భద్రతపై పలు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. దీనిని లీడ్‌లెస్ 2 అని పిలుస్తారు.
దీని కోసం అమెరికా, కెనడా, యూరప్‌లోని 50 కేంద్రాల్లో 670 మంది నమోదు చేసుకున్నారు.
అక్కడ వైద్య పరీక్షల్లో శస్త్ర చికిత్స అవసరం లేని ఈ కొత్త పరికరాన్ని పరీక్షిస్తారు.
కొత్త పేస్‌మేకర్‌కు ఎటువంటి వైర్లు లేకపోవడం వల్ల ఇది సురక్షితమైనది.
గుండె కొట్టుకోవడం మందగించినపుడు ఇతర పేస్ మేకర్లలానే ఇది కూడా విద్యుత్ ప్రకంపనలు సృష్టించి గుండె సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. దీని బ్యాటరీ జీవిత కాలం కూడా ఇతర వాటిల్లానే ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది పేస్‌మేకర్లను వినియోగిస్తున్నారు. ప్రతీ ఏడాది 7 లక్షల మంది కొత్త పేషెంట్లకు వీటిని అమర్చుతున్నారు. వాళ్లకు శస్త్ర చికిత్సలాంటి ఇబ్బందులు లేకుండా దీనిని అమర్చవచ్చు.
దీనిని వల్ల ఎలాంటిఇబ్బందులు తలెత్తవని ఈ పరి శోధన పరిశీలకుడు శ్రీనివాస్ దుక్కిపాటి తెలిపారు.