అతుక్కుపోయారో.. అయిపోతారు
లండన్: మీరు సోషల్ మీడియాకు ఇప్పటికే అతుక్కుపోయి ఉన్నారా.. అయితే మీ చేజేతులారా ప్రశాంతతను కోల్పోయినట్లే. ఇప్పటికైనా తేరుకొని దూరం జరిగితే మంచిది లేదంటే పూర్తి స్థాయిలో మానసిక ఒత్తిడికి లోనై ఎలాంటి దుర్వ్యసనాల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉంది. అవునూ సోషల్ మీడియాలో విహరిస్తున్న యువత ఎక్కువగా ఒత్తిడి బారిన పడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. 19 నుంచి 32 ఏళ్ల మధ్య గల వారిలో ఈ లక్షణాలు అధికం తెలిపింది.
వారం మొత్తం కూడా నిత్యం సోషల్ మీడియాతో బిజీబిజీగా గడిపే వాళ్లకు డిప్రెషన్ లక్షణం వచ్చే అవకాశం 2.7సార్లు అధికం అని వారు వెల్లడించారు. వారంలో 30 సార్లు, ప్రతి రోజు 61 నిమిషాలపాటు సోషల్ మీడియాతో బిజీగా ఉండే మొత్తం 1,787మంది వ్యక్తులను అధ్యయనానికి తీసుకోగా వారిలో మూడో వంతుమంది తీవ్రంగా ఒత్తడికి లోనవుతున్నారని వారంతా కూడా 19 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉన్నవారేనని పిట్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ మీడియా డైరెక్టర్ బ్రియాన్ ప్రిమాక్ తెలిపారు. ఎవరైతే సోషల్ మీడియా కారణంగా ఒత్తిడికి గురవుతున్నారో వారు సామాజికంగా మంచి సంబంధాలు నిర్మించుకోలేరని ఆయన హెచ్చరించారు.