
పొరపాటున బాంబు వేసింది.. షాకింగ్ వీడియో
మాస్కో : శిక్షణలో భాగంగా ట్రయల్స్ వేస్తున్న ఓ సైనిక హెలికాప్టర్ అనూహ్య తప్పిదాన్ని చేసింది. ఒకేసారి రాకెట్లు వదిలి అందిరికీ షాకిచ్చింది. అది కూడా పార్కింగ్ చేసిన మిలిటరీ వాహనాలపైనే కావడంతో మరింత గందరగోళంగా నెలకొంది. రాకెట్ల దెబ్బక సైనికుల వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో రష్యాకు చెందిన న్యూస్ చానెల్స్ పెట్టాయి. రష్యా జపాడ్ 2017 పేరిట ఓ ప్రాంతంలో ప్రత్యేక సైనిక కసరత్తుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
దీనిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూడా పర్యటిస్తున్నారు. అయితే, శిక్షణ ప్రాంతంలో కొన్ని మిలిటరీ వాహనాలు నిలిపి ఉంచారు. మూడు వాహనాలు పక్కపక్కన.. మరో వాహనం వాటికి కొంచెం దూరంలో ఉండగా అప్పుడే విన్యాసాలు చేస్తూ అటుగా వచ్చిన హెలికాప్టర్ ఒకటి రాకెట్లను లాంచ్ చేసింది. దీంతో భారీ పేలుడుతో ఆ వాహనం ధ్వంసం అయింది. దాని ఎదురుగా ఉన్న నడుస్తూ వెళుతున్న ఓ మిలిటరీ వ్యక్తి అక్కడ రేగిన దుమ్ములో మునిగిపోయాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.