ఇప్పటివరకు జ్వరం, దగ్గు, జలుబును మాత్రమే కరోనా లక్షణాలుగా పరిగణించాం.. కానీ ఇప్పుడు అది రూటు మార్చింది. మరిన్ని లక్షణాలతో విరుచుకుపడుతోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం.. రుచి, వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, కండరాల నొప్పి, చలి, వణకడం, తలనొప్పి, గొంతు నొప్పి వంటివాటిని కరోనా లక్షణాల జాబితాలో చేరింది. కోవిడ్-19 బారిన పడిన 2వ రోజు నుంచి 14 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కనిపించే ఆస్కారం ఉందని హెచ్చరించింది. దీంతో కరోనా లక్షణాల సంఖ్య తొమ్మిదికి చేరింది.
1. రుచి లేదా వాసన గ్రహించే శక్తి కోల్పోవడం: బ్రిటన్‌లో కరోనా వ్యాధిగ్రస్తుల్లో చాలామందికి ఇలాంటి లక్షణం ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. దీని ద్వారా తమకు తెలీకుండానే ఇతరులకు వైరస్‌ను అంటించే ప్రమాదముందని పేర్కొంది.
2. చలి: ఇతర దేశాల్లో చలి చిన్నసమస్యగా కొట్టిపారేస్తారు. కానీ ఊరికే చలి పెడుతుందంటే ఆ మాటను తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఇది కూడా వ్యాధి లక్షణమేనని అధ్యయన కారులు నొక్కి చెప్తున్నారు.
3. వణకడం: కరోనా బారిన పడ్డ ఓ పాత్రికేయుడు చలి వణుకు కారణంగా పల్లు పటపట కొరుకుతూ పళ్లూడగొట్టుకోవడంతో ఈ లక్షణం బయటపడింది. కాబట్టి మన దగ్గర మండుటెండలోనూ చలిపెడుతుందంటే వారిపై ఓ కన్నేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండానే చలితో వణకడం కూడా కోవిడ్ ప్రధాన లక్షణం.
4. కండరాల నొప్పి: అమెరికాలో సుమారు 14 శాతానికి పైగా కరోనా బాధితుల్లో ఈ లక్షణం వెలుగు చూసింది. ముఖ్యంగా వయసు పైబడిన వారిని కండరాల నొప్పి వేధిస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ఈ లక్షణం బయటపడింది.
5. తలనొప్పి: జలుబు ఉన్నప్పుడు తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే తల తిరుగుతున్నట్లు అనిపించినా, తలంతా నొప్పిగా అనిపించినా దాన్ని తేలికగా తీసిపారేయడానికి లేదు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో తలనొప్పి కూడా కనిపిస్తోందని అధ్యయనం పేర్కొంది.
6. గొంతు మంట: 60 శాతానికి పైగా కేసులు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు.
సాధారణ సమయాల్లో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందేనని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment