వ్యక్తి నుంచి వ్యక్తికే | CDC Says Coronavirus Doesn't Spread By Touching Surfaces | Sakshi
Sakshi News home page

వ్యక్తి నుంచి వ్యక్తికే

Published Fri, May 22 2020 2:49 AM | Last Updated on Fri, May 22 2020 8:00 AM

CDC Says Coronavirus Doesn't Spread By Touching Surfaces - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: న్యూస్‌ పేపర్‌ పట్టుకుంటే, కరెన్సీ ద్వారా కరోనా వస్తుందన్న వదంతులను అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) తోసిపుచ్చింది. కరోనా వ్యాధిగ్రస్తులు తాకిన వస్తువులు లేదా పరిసరాలను ముట్టుకుంటే కరోనా వస్తుందన్న వదంతులు నిజం కాదని తేల్చింది. వస్తువులు లేదా పేపర్‌ మరేదైనా ముట్టుకుంటే కరోనా సోకినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమాన ప్రతిష్ట కలిగిన ఈ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయన నివేదిక అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
(బుసలు కొడుతున్న కరోనా)

దీన్ని ‘ది న్యూయార్క్‌ పోస్ట్‌’ప్రచురించింది. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తితో నేరుగా కలవడం, వారి ద్వారా వచ్చిన ఇతరులను కలవడం, వారి పక్కనే ఉండటం వల్ల వస్తుందని తెలిపింది. అంతే తప్ప పాజిటివ్‌ వ్యక్తి పట్టుకున్న వస్తువులను, ఉపరితలాలను తాకడం వల్ల కరోనా వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు దొరకలేదని సీడీసీ తేల్చిచెప్పింది. అలాగని వస్తువులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మానేయొద్దని, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దని మాత్రమే పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యక్తి నుంచి వ్యక్తికి మాత్రమే సోకుతుందని స్పష్టం చేసింది. బయటకు వైరస్‌ లక్షణాలు లేని వారి నుంచి కూడా మరో వ్యక్తికి నేరుగా వ్యాపిస్తుందని పేర్కొంది. అయితే మార్చిలో ఇదే సంస్థ విడుదల చేసిన నివేదికలో.. పరిసరాలను తాకడం వల్ల రావొచ్చని పేర్కొంది. ఇప్పుడు మాత్రం పరిసరాలు, వస్తువులను తాకడం వల్ల అంత సులభంగా రాదని తాజా అధ్యయనంలో తేల్చి చెప్పింది. ‘వైరస్‌ ఉన్న వ్యక్తి తాకిన వస్తువును లేదా ఉపరితలాన్ని మరో సాధారణ వ్యక్తి చేతితో ముట్టుకుని నోరు లేదా ముక్కు లేదా కళ్లను తాకడం ద్వారా కరోనా రావొచ్చు’అని తెలిపింది.
(నియంత్రిత సాగే రైతు‘బంధు’)
అమెరికా కేసులను అధ్యయనం చేసి..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అలా వచ్చిన లక్షలాది కేసులన్నింటినీ అధ్యయనం చేసి ఈ నివేదిక ఇచ్చినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇతర దేశాల్లో వచ్చిన కేసులను కూడా సీడీసీ అధ్యయనం చేసినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో పాటు తెలంగాణలో నమోదైన పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే, ఎక్కువ శాతం కరోనా కేసులు కుటుంబాల్లోనే వెలుగు చూశాయి. అత్యంత దగ్గరి సంబంధం కలిగిన వారికే కరోనా సోకిందని తేలింది. పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి 6 అడుగుల కంటే దగ్గరగా ఉండటం, వారితో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వ్యాపిస్తుంది. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారు దగ్గడం, తుమ్మడం, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపర్లు మరో వ్యక్తి నోటిలో లేదా ముక్కులో పడటానికి కారణమవుతాయి. అప్పుడు సులువుగా కరోనా వ్యాప్తిస్తుంది. అందువల్ల ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని సీడీసీ స్పష్టం చేసింది.

నివేదికలోని పలు సూచనలు

  • కరోనా సోకిన వ్యక్తి, అనుమానిత లక్షణాలున్న వారు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీడీసీ పలు సూచనలు చేసింది.
  •  గాలి, వెలుతురు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల వారి శ్వాసకోశ బిందువులు బయటకు వెళ్లడానికి వీలుంటుంది.– వారు ఉండే ఇంటిని శుభ్రంగా ఉంచాలి. వస్తువులను, ఉపరితలాలను, సూక్ష్మక్రిములు, ధూళి, మలినాలను తొలగించాలి.
  • స్విచ్‌లు, హ్యాండిల్స్, డెస్క్‌లు, మరుగుదొడ్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను శుభ్రపరచాలి. 
  • టచ్‌ స్క్రీన్‌లను ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌తో తుడవాలి. 
  • టేబుళ్లు, కుర్చీలు, ఫోన్లు, టాబ్లెట్‌లు, టచ్‌ స్క్రీన్‌లు, రిమోట్‌ కంట్రోల్స్, కీ బోర్డులు తుడవాలి.
  • ఉపరితలాలను శుభ్రపరిచేటప్పుడు చేతి తొడుగులు ధరించాలి. వాటిని వెంటనే తీసేయాలి.
  • చేతులు తరచూ కడుక్కోవాలి. లేకుంటే కనీసం 60 శాతం ఆల్కహాల్‌ కలిగి ఉన్న హ్యాండ్‌ శానిటైజర్‌ వాడాలి.
  • అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వీలైతే తన గదిలోనే తినాలి.

పెద్ద చర్చ జరుగుతోంది
సీడీసీ ఇచ్చిన నివేదికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనూ ఇతర అనేకచోట్ల కేసులు రికార్డు అయ్యాయి. ఒకవేళ ఉపరితలాలు, వస్తువుల ద్వారా కరోనా సోకేటట్లయితే ఇప్పటికే దేశంలోనూ లక్షలాది కేసులు నమోదయ్యేవి. కాబట్టి సీడీసీ అధ్యయనం వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉంది.  
- డాక్టర్‌ కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement