నా భర్తకు పదవులు ఇవ్వను: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరఫున ముందున్న అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త బిల్ క్లింటన్ తన ప్రభుత్వంలో ఏ మంత్రి పదవిని చేపట్టరని పేర్కొంది. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చునే వ్యక్తి తానే అని హిల్లరీ భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు చెప్పవచ్చు. అధికారంలోకి వస్తే మీ భర్త బిల్ క్లింటన్ కు క్యాబినెట్ లో చోటుదక్కుతుంతా అని ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న హిల్లరీని ఓ విలేకరి అడిగారు.
ఈ ప్రశ్నపై హిల్లరీ స్పందించిన తీరుకు మీడియా వారు ఆశ్చర్యపోయారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్ క్లింటన్ కు క్యాబినెట్ లో చోటు ఉండదని స్పష్టం చేశారు. కోవింగ్టన్, కెంటుకి ఏరియాల్లో ఆదివారం జరిగిన ప్రచార కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా బిల్ క్లింటన్ కు ఉన్నత పదవి దక్కుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన భర్త ఆర్థికవ్యవస్థను గాడిలో పెడతాడంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరుసటి రోజు(సోమవారం) మీడియాకు ఆమె వివరణ ఇచ్చింది. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లోనూ తన భర్త క్లింటన్ రిటైర్ అవ్వరని అందుకు తన వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయంటూ చెప్పిన హిల్లరీ తాజాగా చేసిన వ్యాఖ్యలతో అమెరికా వాసులు షాక్ తిన్నారు.