
పాకిస్తాన్ - అమెరికా బంధం బీటలు వారిందా? దశాబ్దాలుగా మైత్రితో ఉన్న ఇరు దేశాల మధ్య చైనా చిచ్చు పెట్టిందా? భారత్‌కు దగ్గరవుతున్నఅమెరికా.. పాకిస్తాన్‌కు చేత్తో సమాధానం చెబుతుందా? ట్రంప్ అధ్యక్షుడయ్యాక.. ఇరు దేశాల మధ్య మాటల మంటలు ఎందుకు రేగుతున్నాయి? ట్రంప్ పాకిస్తాన్‌ను దూరం పెడుతున్నాడా? పాకిస్తానే.. దూరం జరుగుతోందా? ఈ వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇస్లామాబాద్ : పాకిస్తాన్-అమెరికాలు కొన్నేళ్లుగా దూరం జరగుతున్నాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ న్యూ పాలసీని ట్రంప్ ప్రకటించాక ఇది మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ అధికారికంగా సహకారం అందిస్తోందని అమెరికా చేసిన ప్రకటన సంచలనమైతే.. అదే సమయంలో అమెరికన్ గన్ లాబీకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయిన పాకిస్తాన్ ప్రకటించింది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)పై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల వివాదాస్పద ప్రాంతం (పాక్ ఆక్రమిత కశ్మీర్)లో రహదారి నిర్మించాలనుకోవడం అంతర్జాతీయ నిబంధనలకు తూట్లు పొడవడమేనని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ స్పష్టం చేశారు. ఆక్రమిత కశ్మీర్ అనేది అంతర్జాతీయంగా వివాదాస్పద ప్రాంతం.. ఆ సమస్య సమితి పరిధిలో ఉంది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో చైనాతో కలిసి ఎకనమిక్ కారిడార్ పనులు చేపట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌పై మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న భారత్‌కు మాటిస్ వ్యాఖ్యలు అదనపు బలాన్ని ఇచ్చింది.
మాటిస్ వ్యాఖ్యలను పాకిస్తాన్ తీవ్రంగా తప్పుపట్టింది.. చైనా - పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు ప్రజాప్రయోజనాలు, మౌలిక అవసరాల కల్పనలో భాగంగా నిర్మిస్తున్నట్లు పాక్ ఆదివారం ప్రకటించింది. సీపీఈసీ నెట్‌వర్క్ వల్ల దక్షిణ పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టు నుంచి చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతం మధ్య కనెక్టివిటీ జరుగుతుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వల్ల రవాణా, వ్యాపార సదుపాయాలు మెరుగు అవుతాయని.. పాకిస్తాన్ పేర్కొంది. పీఓకే వివాదాస్పద ప్రాంతమైనా.. అది మా అధీనంలో ఉంది కాబట్టి మేం.. ప్రాజెక్టు చేపట్టాం.. ఇది అమెరికాకు నచ్చాల్సిన అవసరం లేదు.. అని పాకిస్తాన్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment