
సియోల్: ఉభయ కొరియా దేశాల మధ్య సుమారు రెండేళ్ల తరువాత మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు తన బృందాన్ని పంపడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అలాగే దక్షిణ కొరియాతో మిలటరీ హాట్‌లైన్ సర్వీసును పునఃప్రారంభించినట్లు వెల్లడించింది.
అణు పరీక్షలతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ద.కొరియాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ చొరవ చూపడంతో ఇరు దేశాల సరిహద్దు గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో సోమవారం ఈ చర్చలు మొదలయ్యాయి. చర్చల పేరిట ద.కొరియా, అమెరికా మధ్య దూరం పెంచడానికి కిమ్ యత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కుటుంబాల కలయిక, సైనిక చర్చల ప్రస్తావన
అధికారులు, అథ్లెట్లు, పాత్రికేయులు, చీర్‌లీడర్లతో కూడిన తమ బృందాన్ని వింటర్ ఒలింపిక్స్‌కు పంపుతామని ఉ.కొరియా ప్రతినిధి బృందం తెలిపింది. యుద్ధం వల్ల రెండు దేశాల మధ్య విడిపోయిన కుటుంబాలను తిరిగి కలిపే చర్యలను పునరుద్ధరించాలని చర్చల్లో పాల్గొన్న ద.కొరియా మంత్రి చున్ హాయె సుంగ్ ప్రతిపాదించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించేలా ఇరు దేశాల మధ్య సైనిక చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ అవసరాన్ని ద.కొరియా నొక్కి చెప్పగా.. చర్చల ద్వారానే రెండు కొరియా దేశాలు శాంతి, స్థిరత్వానికి పాటుపడాలని ఉ.కొరియా బదులిచ్చింది. ఇటీవల నిలిపేసిన హాట్‌లైన్ సర్వీసుల్లో రెండింటిని పునరుద్ధరించినట్లు కూడా ద.కొరియా ప్రతినిధి బృందానికి వెల్లడించింది. మిలటరీ చర్చలు, కుటుంబాల కలయికకు సంబంధించి ద.కొరియా చేసిన ప్రతిపాదనలకు బదులుగా ఉ.కొరియా కూడా కొన్ని డిమాండ్లు చేసే అవకాశాలున్నాయి. వాటిలో అమెరికాతో కలసి ద.కొరియా నిర్వహిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాల నిలిపివేత వంటివి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.