
ప్యోంగ్ యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తరచుగా అణు క్షిపణి పరీక్షలతో అగ్రదేశాలను సైతం గడగడలాడించే వ్యక్తి నియంత కిమ్. తమ పొరుగుదేశం దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌కు ఓ అందగత్తెల సైన్యాన్ని పంపాలని కిమ్ డిసైడ్ అయ్యారట. ఆ భామలు ఆయుధాలు లాంటివి చేతపట్టేవారైతే కాదు సుమా.. కేవలం తమ అధ్యక్షుడు పంపుతున్నారన్న కారణంగా దక్షిణ కొరియాకు వెళ్తున్నారు.
అందగత్తెల బృందానికి నేతృత్వం వహించేది ఎవరంటే కిమ్ ప్రేయసి హోన్ సాంగ్ వోల్. ఇటీవల కిమ్ ఆమెను హత్య చేయించారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఆమె దర్శనమివ్వడంతో అవన్నీ వదంతులేనని తేలిపోయింది. నియంతగా దేశాన్ని పాలిస్తున్నాడన్న అపప్రతను తొలగించుకోవడానికి అందగత్తెలను కిమ్ ద.కొరియాకు పంపుతున్నారట. 22 మంది తమ అథ్లెట్లను కిమ్ వింటర్ ఒలింపిక్స్ లో భాగస్వాములు చేయాలనుకున్న తరుణంలో ఆయన ప్రేయసి సాంగ్ వోల్ బయటి ప్రపంచానికి దర్శనమిచ్చింది. ప్యోంగ్ యాంగ్‌కు చెందిన మారన్ బాంగ్ బ్యాండ్‌కు హోన్ సాంగ్ వోల్ లీడ్ చేస్తోంది. ఈ బ్యాండ్ ను తన హస్తగతం చేసుకున్న కిమ్ ఆదేశానుసారం ఆ మహిళలు స్టేజ్ షోలు చేస్తుంటారు.
సాధారణంగా కొంతమంది అందెగత్తెలు ఓ బృందంగా ఉంటే 'ఆర్మీ ఆఫ్ బ్యూటీస్' అని సంబోధిస్తారు. ఈ అందగత్తెలు అథ్లెట్లతో పాటు ద.కొరియా వెళ్తారు. సైనికుల డ్రెస్ కోడ్ తరహాలో రూపొందించిన దుస్తులను ధరించి నృత్యాలు చేసి తమదేశం గురించి నినాదాలు చేస్తారు. దీంతో ఉత్తర కొరియాలో నియంత పాలన లేదని ప్రపంచ దేశాలకు చాటిచెప్పాలని కిమ్ ప్లాన్ చేస్తున్నారు. ఒలింపిక్స్ అనగానే అథ్లెట్లను ప్రోత్సహించి పంపించే అధినేతలను చూశాం కానీ, ఇలా డ్యాన్సర్స్ (అందగత్తెలు) ను పంపే వ్యక్తి కేవలం కిమ్ జాంగ్ ఉన్ ఒక్కడే అయి ఉంటారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment