ఇల్లే జెన్‌కో.. ఇల్లే ట్రాన్స్‌కో
ఎక్కడో కరెంటు ఉత్పత్తి అవుతుంది. అక్కడినుండి తీగల వెంబడి కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తే మనం వాడుకుంటాం. ఇలా విద్యుత్ సరఫరా అవుతుంది. కానీ ఫొటోల్లో కనిపిస్తున్న ఇళ్లున్నాయి చూశారా.. ఇవి చాలా స్పెషల్. ఎందుకంటే వీటిల్లో ఒకొక్కటీ ఓ విద్యుత్తు జనరేటర్! అర్థం కాలేదా? బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతంలో పదహారు ఇళ్లతో కూడిన ఓ కాంప్లెక్స్‌ను కడుతున్నారు. సింగిల్‌బెడ్ రూమ్‌లతోపాటు టూ, త్రీ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా ఉన్నాయి దీంట్లో. ప్రతి ఇంట్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం మాత్రమే ఈ కాంప్లెక్స్ తాలూకూ విశేషం కాదు. విద్యుత్ అవసరాలన్నింటినీ అక్కడికక్కడే తీర్చేసేలా అన్ని రకాల టెక్నాలజీలనూ వాడారు. దాంతోపాటే విద్యుత్తును వీలైనంత ఆదా చేసే సాంకేతిక పరిజ్ఞానమూ ఉందిక్కడ. పైగా అంతా ఉచితం. ‘బిల్డింగ్స్ యాస్ పవర్‌స్టేషన్స్’ పేరుతో స్వాన్‌సీ విశ్వవిద్యాలయ విభాగం స్పెసిఫిక్ చేపట్టిన ప్రాజెక్టు ఇది.
ఇందులోని పైకప్పులు, గోడలపైన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును బ్యాటరీల్లో నిక్షిప్తం చేయడం.. దీపాలు, ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాల కోసం వాటిని వాడటం మామూలే. మిగిలిపోయిన విద్యుత్తును కామన్ బ్యాటరీల్లోకి చేర్చి విద్యుత్తు వాహనాలను చార్జ్ చేసేందుకు వాడతారు. దీంతోపాటు ఇంటి భాగాలు కొన్నింటిని ఉక్కు పలకలతో కప్పేస్తారు. సూర్యుడి తీక్షణ కాంతికి వేడెక్కే పలకల వెనుకభాగంలోని గాలిని ఇంటిని వెచ్చబెట్టుకునేందుకు వాడతారు. ఈ ఏర్పాట్లు అన్నింటి వల్ల దాదాపు 15 శాతం వరకూ ఉన్న విద్యుత్తు పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చునని, పెద్దస్థాయిలో అమలు చేస్తే కొత్తగా విద్యుత్తు ప్లాంట్లు కట్టాల్సిన అవసరమూ ఉండదని అంటున్నారు స్పెసిఫిక్ సీఈవో కెవిన్ బైగేట్. వేల్స్ ప్రాంతంలోని ఈ పైలట్ ప్రాజెక్టు తరువాత 1,200 ఇళ్లతో ఇంకో పెద్ద ప్రాజెక్టు చేపడతామని బైగేట్ అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఇళ్ల నిర్మాణనికయ్యే ఖర్చు పది నుంచి 20 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ విద్యుత్తు బిల్లుల ఆదా ద్వారా అదనపు వ్యయాన్ని తొందరగానే భర్తీ చేసుకోవచ్చునట. బ్రిటన్‌లోని సంప్రదాయ విద్యుత్తు వ్యవస్థపై ఉన్న డిమాండ్‌ను మూడు గిగావాట్ల వరకూ తగ్గిస్తే ఏడాదికి 1,100 కోట్ల పౌండ్లు ఆదా చేయవచ్చునని ఆయన అంచనా.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్