పెళ్లిరోజున చివరి ఫొటో తీసి.. భార్యను తోసేశాడు!
తన మొదటి భార్య చనిపోయినప్పుడు హరాల్డ్ హెన్‌థ్రాన్ ఓ పిట్టకథ చెప్పాడు. కళ్లముందే తన భార్య ప్రమాదం బారినపడి ప్రాణాలు విడిచిందని, తాను సంఘటనాస్థలంలో ఉన్నప్పటికీ చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయానని కథలు అల్లి చెప్పాడు. అంతా నమ్మారు. అతని పట్ల సానుభూతి చూపారు. ఓదార్చారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మరో మహిళను అతను ప్రేమించి పెళ్లాడాడు. 17 ఏళ్ల దాంపత్య జీవితం అనుభవించకా.. ఇప్పుడు రెండో భార్య మృతి విషయంలోనూ హరాల్డ్ అదే కట్టుకథను అల్లి చెప్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
అమెరికా కోలరాడోలోని డెన్వర్ ప్రాంతానికి చెందిన హరాల్డ్ హెన్‌థ్రోన్ ఒక వ్యాపారవేత్త. అతని మొదటి భార్య సాండ్రా లీన్. 1995లో ఆమె ఒక విస్మయకర ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. ఆ రోజు రాత్రి భార్యాభర్తలు ఇద్దరు కలిసి డిన్నర్‌కు వెళ్లారు. డిన్నర్ అయిన తర్వాత తిరిగి వస్తుండగా కారు టైరు ఒకటి పగిలిపోయింది. దీంతో కారును జాక్ మీద నిలిపి మార్చేందుకు హరాల్డ్ ప్రయత్నిస్తుండగా ఒక నట్టు.. ఊడిపోయి కారు కిందకు వెళ్లింది. దీంతో లీన్‌ను కారు కిందకు వెళ్లి నట్టు తీసుకురమ్మని చెప్పాడు. ఆమె కారు కిందకు వెళ్లిందో లేదో జాక్ సాయంతో ఉన్న కారు కిందకు కుప్పకూలింది. ఆమె సంఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు హెన్‌థ్రోన్ ఒక్కడే సాక్షి. అతడే ఈ కథను అందరికీ చెప్పి నమ్మించాడు.
ఆ ఘటన జరిగిన ఐదేళ్లకు ఓ క్రైస్తవ డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయమైన టోనీ బెర్టోలెట్‌ను హరాల్డ్ వివాహం చేసుకున్నాడు. అతడు వ్యాపారం చేస్తూనే స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు సేకరించేవాడు. టోనీ నేత్ర వైద్యురాలు. తనకు కుటుంబానికి చెందిన చమురు కంపెనీలో ఆమెకు భారీగా వాటా ఉంది. ఈ దంపతులకు ఓ కూతురు హేలే ఉంది. వీరి దాంపత్యం జీవితం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2012 వేసవిలో హరాల్డ్ ఓ సర్‌ప్రైజ్ విహారయాత్రకు ప్లాన్ చేశాడు. పెళ్లి రోజును జరుపుకొనేందుకు దంపతులు ఇద్దరు కలిసి రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ కు వెళ్లారు. అక్కడ 130 అడుగుల పర్వతం మీద దంపతులు ఇద్దరు సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఈ క్రమంలో 130 అడుగుల పర్వత శిఖరాగ్రం నుంచి టోనీ కిందకు పడిపోయిందని హరాల్డ్ పోలీసులకు ఫోన్ చేశాడు. టోనీ చనిపోయిన ప్రమాదానికి కూడా హరాల్డ్ ఒక్కడే సాక్షి. 50 ఏళ్ల టోనీ కీళ్లనొప్పులతో బాధపడుతున్నా అతి కష్టంమీద ఆ పర్వతాన్ని ఎక్కింది. ఆమె శిఖరాగ్రం వద్ద తన ఫొటో తీస్తూ.. ఒక్కసారిగా జారి కిందపడిపోయిందని, తనకు తన భార్య దూరమైందని బంధువుల ముందు వాపోతూ హరాల్డ్ చెప్తున్నాడు. కానీ మొదటిసారి గుడ్డిగా అతన్ని నమ్మిన బంధువులు ఇప్పుడు మాత్రం నమ్మడం లేదు. టోనీ మరణంపై ఆమె కుటుంబసభ్యులు అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిజానికి ఇద్దరి భార్యల మరణంతోనూ హరాల్డ్ భారీగా లబ్ధిపొందాడు. మొదటి భార్య లీన్ మరణంతో అతనికి 3.50 పౌండ్ల బీమా పరిహారం అందగా.. రెండో భార్య మరణం వల్ల మిలియన్ పౌండ్ల పరిహారం అతనికి అందే అవకాశముంది. అంతేకాకుండా గతంలోనూ ఓ సారి తన ఇంట్లో రెండో భార్యను చంపడానికి అతను ప్రయత్నించాడని, ఆ ప్రమాదం నుంచి ఆమె తృటిలో బయటపడిందని పోలీసులు విచారణలో కనుగొన్నారు. ఇప్పుడు కోర్టు ముందు టోనీ మృతి కేసు నడుస్తోంది. రెండో భార్య మరణమే కాదు మొదటి భార్య మృతి విషయంలోనూ హరాల్డ్ పై పోలీసులు మోపిన అభియోగాలను కోర్టు ఇప్పుడు విచారిస్తోంది. అయితే అతని న్యాయవాదులు మాత్రం ఈ రెండు ఘటనలూ ప్రమాదాలేనంటూ కోర్టు ముందు వాదిస్తున్నారు.