అక్టోబర్ తర్వాత పోటీలో ఉండననుకున్నా
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 2015 జూన్‌లో ట్రంప్ తన ప్రచారాన్ని ప్రారంభించాక, అక్టోబర్‌కు మించి రేసులో ఉంటానని ఆయనే అనుకోలేదట. ఈ విషయాన్ని ఆయనే రిపబ్లికన్ పార్టీలో తన ప్రత్యర్థి, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీతో చెప్పినట్లు ఒక పుస్తకం పేర్కొంది. అప్పట్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వారిలో క్రిస్ క్రిస్టీ ఒకరు. ట్రంప్, క్రిస్టీలలో ఎవరు రేసు నుంచి వైదొలిగినా పోటీలో నిలిచిన వారికి ఓడిపోయిన వారు మద్దతు ఇచ్చుకోవాలని వారి మధ్య ఒప్పందం ఉండేదని సీఎన్‌ఎన్ రాజకీయ పాత్రికేయులు రాసిన ‘అన్‌ప్రెసిడెంటెడ్: ద ఎలక్షన్ దట్ చేంజ్‌డ్ ఎవ్రీథింగ్’ అనే పుస్తకంలో వివరించారు.
ట్రంప్‌కు పుతిన్ ఫోన్
ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి మంగళవారం ఫోన్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. రష్యాతో బలమైన బంధం ఏర్పరచుకునేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ పుతిన్‌తో అన్నారు.
ట్రంప్‌కు ఒబామా హెచ్చరిక
ఇరాన్ అణు ఒప్పందం, పారిస్ వాతావరణ మార్పు ఒప్పందం లాంటి అంతర్జాతీయ నిర్ణయాలను రద్దు చేయకూడదని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా ట్రంప్‌ను హెచ్చరించారు. ట్రంప్ పరిపాలనకు, ప్రచారానికి తేడా తెలుసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందాలు కుదరడం వెనుక ఎంతో శ్రమ ఉందన్నారు.
మిషెల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళ
అమెరికా ప్రథమ మహిళ మెషెల్ ఒబామాపై చార్ల్స్‌టన్‌లోని క్లే పట్టణానికి చెందిన పమేలా టేలర్ అనే మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇక అందమైన, హుందాగా ఉండే ప్రథమ పౌరురాలిగా మెలానియా ట్రంప్ రాబోతోంది. ఇన్నాళ్లూ హై హీల్స్ వేసుకున్న కోతిలా ఉండే మిషెల్‌ని చూడలేక విసిగిపోయాను’ అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో పోస్ట్ తీసేసి క్షమాపణలు కోరారు.