మా ఆవిడతో కలిసి తాజ్‌మహల్ చూడాలి: ఒబామా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. గడిచిన రెండేళ్లలో ఈ ఇద్దరు నాయకులు కలుసుకోవడం ఇది ఎనిమిదోసారి. లావోస్‌లో జరిగిన ఏసియాన్ సదస్సుకు మోదీతో పాటు ఒబామా కూడా హాజరయ్యారు. త్వరలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం, ఒబామా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మోదీ ఆయనను మరోసారి భారతదేశానికి ఆహ్వానించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా భారత్ రావాలని చెప్పారు. దానికి ఒబామా కూడా సానుకూలంగా స్పందించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను తాను ఇంతవరకు తన భార్య మిషెల్‌తో కలిసి చూడలేదని, ఒకసారి దాన్ని చూడాలని ఉందని, అందుకోసం తప్పకుండా వస్తానని చెప్పారు.
2008 నాటి ముంబై ఉగ్రదాడులతో పాటు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఈ జనవరిలో జరిగిన దాడికి కారకులను పాకిస్థాన్ గుర్తించి శిక్షించాలని ఏషియాన్ సదస్సు సందర్భంగా ఒబామా, మోదీ ఇద్దరూ గట్టిగా డిమాండ్ చేశారు. తమ పొరుగున ఉన్న ఒక దేశం ఉగ్రవాదాన్ని తయారుచేసి, ఎగుమతి చేస్తోందని పాకిస్థాన్ పేరు చెప్పకుండానే నరేంద్రమోదీ అన్నారు. అలాంటి దేశాల మీద ఆంక్షలు విధించి, వాటిని ఒంటరి చేయాలని చెప్పారు. జి20 సదస్సులో సైతం.. ఒకే ఒక్క దేశం దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని మోదీ అన్నారు. కాగా, జీఎస్టీ బిల్లును ఆమోదించినందుకు ప్రధాని మోదీని బరాక్ ఒబామా అభినందించారు.