![Imran Khan says ready for talks with PM Modi - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/30/IMRAN-KHAN-3-1.jpg.webp?itok=TSztNdbs)
ఇస్లామాబాద్/అమృత్‌సర్: భారత ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తమ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం పాక్‌కు ఎన్నటికీ లాభం చేకూర్చదన్నారు. ఉగ్రమూకలకు మద్దతు నిలిపివేసేవరకూ పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని విదేశాంగ మంత్రి సుష్మ ప్రకటించిన నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. ‘పాక్ ప్రజలంతా భారత్‌తో శాంతిని కోరుకుంటున్నారు. మోదీతో ఏ విషయంపై అయినా చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.
సైనిక చర్యతో కశ్మీర్ సమస్యను పరిష్కరించలేం. పొరుగుదేశాల్లో విధ్వంసం సృష్టించే ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పించడం పాక్‌కు ఎన్నటికీ లాభించదు’ అని వెల్లడించారు. భారత్–పాక్‌ల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారవుతుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు..‘అసాధ్యమన్నది ఏదీ లేదు‘ అని ఇమ్రాన్ జవాబిచ్చారు. పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరాబాబా సాహిబ్ గురుద్వారాలను కలుపుతూ నిర్మిస్తున్న కారిడార్ పట్ల తనకు తెలిసినంతవరకూ మెజారిటీ భారతీయులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
అయితే శాంతిచర్చల కోసం ఇరుపక్షాలు ముందుకురావాల్సి ఉంటుందనీ, ఓపక్షం చొరవ సరిపోదని వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత్ నుంచి ఈ విషయంలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. నిషేధిత జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్, ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్ సయీద్‌పై ఇప్పటికే ఐరాస ఆంక్షలు విధించిందనీ, జేయూడీని ఉగ్రసంస్థగా ప్రకటించిందని గుర్తుచేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించడంపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘మనం గతంలో బతకలేం. గతాన్ని వదిలేసి భవిష్యత్ దిశగా ఇరుదేశాలు సాగాలి. పాక్ గాలిస్తున్న కొందరు నేరస్తులు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
ఖలిస్తాన్ వేర్పాటువాదితో సిద్ధూ
పంజాబ్ మంత్రి సిద్ధూ ఖలిస్తాన్ వేర్పాటువాది, పాక్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (పీఎస్‌జీపీసీ) సభ్యుడు గోపాల్‌సింగ్ చావ్లాతో కలిసి ఫొటో దిగారు. దీనిపై శిరోమణి అకాలీదళ్ నేత సుక్బీర్ బాదల్ మాట్లాడుతూ.. ఇటీవల సిద్ధూ నియోజకవర్గంలో జరిగిన బాంబుదాడి వెనుక గోపాల్ ఉన్నారని ఆరోపించారు. దేశం ముఖ్యమో లేక ఇలాంటి వ్యక్తులు ముఖ్యమో సిద్ధూ స్పష్టం చేయాలన్నారు. కాగా, ఈ విమర్శలపై సిద్ధూ స్పందిస్తూ.. ‘పాక్‌లో నేను చాలామందితో కలిసి ఫొటోలు దిగాను. వాటిలో ఎవరెవరు ఉన్నారో చెప్పడం కష్టం. పాక్ ప్రజలు కురిపించిన ప్రేమకు నేను తడిసి ముద్దయ్యా.. రోజుకు అక్కడ 10,000 ఫొటోలు దిగాను. వాటిలో ఉన్నది చావ్లానా? చీమానా? అన్నది నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ గురుద్వారా కమిటీ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ సర్నా మాట్లాడుతూ.. గోపాల్ సింగ్ చావ్లాను తప్పించుకునేందుకు సిద్ధూ యత్నించారనీ, కానీ ఎలాగోలా సిద్ధూతో ఫొటోలు దిగగలిగాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment