
ఆ చిన్నారే.. ఇప్పుడు గ్రాడ్యుయెట్!
అది 1998నాటి మాట. అమెరికా కనెక్టికట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చుట్టుముట్టాయి.అగ్నిమాపక శాఖ ఉద్యోగి పీటర్ గెట్జ్ తన సిబ్బందితోపాటు కూడా అక్కడికి వచ్చాడు. మంటల్లో ఇద్దరు చిక్కుకొని ఉన్నారు. అందులో ఒకరు మరణించగా.. ఐదేళ్ల చిన్నారి సృహతప్పి పడిపోయింది. అగ్నిప్రమాదం వల్ల షాక్‌తో ఆ చిన్నారి గుండె ఆగినంత పనైంది. దీంతో ఆ చిన్నారికి నోటి ద్వారా శ్వాస అందిస్తూ.. సీపీఆర్ ప్రథమ చికిత్స అందించి.. అంబులెన్స్ వచ్చేదాక వేచి చూడకుండా వెంటనే తన బైకు మీద ఆస్పత్రికి తీసుకెళ్లాడు పీటర్ గెట్జ్.. అలా మృత్యుకోరల నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్న జోసిబెల్క్ అపోంటె.. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఈస్టర్న్ కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. 23 ఏళ్ల జోసి పట్టా అందుకుంటుంటే.. ఆ దృశాన్ని చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన పీటర్ గెట్జ్ కళ్లలో కూడా ఆనందంతో నీళ్లు మెదిలాయి.
ప్రస్తుతం రిటైరై విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న గెట్జ్.. తాను కాపాడిన చిన్నారి జోసిబెల్క్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పాడు. 'ఆనాడు నేను చేసింది నా డ్యూటీ మాత్రమే. అందుకు నాకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు జోసిని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉంది. తన ఎన్నో కష్టాలను అధిగమించింది. అగ్నిప్రమాదంలో ఆత్మీయుల్ని కోల్పోయింది. శారీరకంగా, మానసికంగా ఎంతో క్షోభ అనుభవించింది. అయినా వాటన్నింటినీ తట్టుకొని తను నిలదొక్కుకుంది. ఇప్పుడు ఉజ్వలమైన తారగా ఇప్పుడు మన ముందు నిలిచింది' అని గెట్జ్ ఆనందం వ్యక్తం చేశాడు.
అటు జోసిబెల్క్ కూడా గెట్జ్ పట్ల ఎంతో కృతజ్ఞాతభావాన్ని ప్రకటించింది. 'నేను దాదాపు చనిపోయాను. కానీ నాకు పునర్జన్మ దక్కింది. అందుకు కారణం పీటర్ గెట్జ్. ఆ రోజు నాకు సహాయంగా వచ్చిన ఇతర అగ్నిమాపక సిబ్బంది' అని జోసి చెప్పింది. తనకు పునర్జన్మను ఇచ్చిన గెట్జ్‌ను ఫేస్‌బుక్‌లో వెతికి పట్టుకొని మరీ ఆయనను తమ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆహ్వానించింది. ఆమె పంపిన తొలి మెసేజ్ చదివినప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని గెట్జ్ చెప్పాడు.