
ఇండో-పాక్ జాతీయ భద్రతా సలహాదారుల భేటీ
ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదార్ల కీలక భేటీ ఆదివారం బ్యాంకాక్లో జరిగింది.
బ్యాంకాక్: భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదార్ల కీలక సమావేశం ఆదివారం బ్యాంకాక్లో జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా టెర్రరిస్టుల కార్యకలపాలు, జమ్ము కశ్మీర్, శాంతి-భద్రతల సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదార్లు అజిత్ దోవల్, నసీర్ జంజ్వా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గత వారం పారిస్ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు మోదీ, నవాజ్ షరీఫ్ కలసిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం జరిగింది. వీరిద్దరూ మరోసారి భేటీ అయ్యే అవకాశముంది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం పాక్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాలను స్వాగతిస్తామని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.