భారత్ భయ్యా.. బుర్ర పెట్టి ఆలోచించు:చైనా
బీజింగ్: వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్) ప్రాజెక్టుపై భారత్ తన అభిప్రాయాన్ని పునరాలోచించుకోవాలని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌టైమ్స్ పేర్కొంది. ప్రపంచదేశాలన్నీ ఓబీఓఆర్ ద్వారా ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని భావిస్తుంటే భారత్ మాత్రం అందుకు విభిన్నంగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించింది. చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు యూఎన్ మద్దతు కూడా ఉందని చెప్పింది.
ఓబీఓఆర్‌పై భారత్ మనసు మార్చుకోవాలని, అపోహలు వీడి బయటిప్రపంచలోకి వచ్చి చూడాలని హితవు పలికింది. అప్పట్లో చైనా చేపట్టిన ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్(ఏఐఐబీ)ను అమెరికా వ్యతిరేకించి పొరబాటు చేసిందని.. అదే తప్పును ఓబీఓఆర్‌పై భారత్ ఇప్పుడు చేస్తోందని పేర్కొంది. భారత్ ఓబీఓఆర్‌పై ఇతర దేశాల్లో వ్యతిరేకత తీసుకురావడంలో విఫలమైతే తనే వచ్చి భాగస్వామి కావొచ్చని తెలిపింది.
సమస్యాత్మక ప్రాంతమైన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారీగా పెట్టుబడులు రావడం భారత్‌ను ఆందోళనలకు గురిచేస్తుందని చెప్పింది. అయితే, సాధారణ పెట్టుబడులకు, కమర్షియల్ పెట్టుబడులకు తేడాను భారత్ గుర్తించాలని సూచించింది. ఓబీఓఆర్ ప్రాజెక్టు ద్వారా ఆసియా దేశాలతో యూరప్‌కు ఎకనమిక్ కారిడార్ ఏర్పడుతుంది. సీపీఈసీ, బీసీఐఎమ్ కారిడార్లు కూడా చైనా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఉన్నాయి.