
భారత్‌పై ఉగ్ర దాడి జరగకూడదు
- ఒబామా పర్యటన సందర్భంగా పాక్‌కు అమెరికా హెచ్చరిక
- ఒకవేళ అటువంటి దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి
- ఒబామా భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల జాగ్రత్తలు
- గణతంత్ర వేడుకల్లో రాజ్‌పథ్ వీవీఐపీ వేదికకు ఏడంచెల భద్రత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌లో పర్యటిస్తుండగా భారత్‌పై ఎలాంటి సీమాంతర ఉగ్రవాద దాడి జరగకుండా చూడాలని పాకిస్తాన్‌కు అమెరికా సూచించింది. ఒకవేళ అలాంటి దాడి ఏదైనా జరిగితే, అది పాక్ నుంచే జరిగిందని వెల్లడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించింది. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒబామా భారత్‌లో పర్యటించనుండడం తెలిసిందే.
ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఒబామా.. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు బహిరంగ వేదిక (ఓపెన్ ఎయిర్ ప్లాట్‌ఫాం)పై ఉండనున్నారు. దీంతో ఆయన భద్రత విషయమై అమెరికా, భారత భద్రతా సంస్థలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి నేతలు భారత్‌లో పర్యటిస్తుండగా.. పాక్ నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్‌లో దాడులకు పాల్పడిన చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్చరికలు జారీచేసినట్లు చెప్తున్నారు.
2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ భారత్‌లో పర్యటిస్తున్నపుడు కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా బలగాలు ఆ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా, భారత్‌ల మధ్య నిఘా సమాచారం మార్పిడి అనూహ్యంగా పెరిగింది.
ఒబామాకు గుర్తిండిపోయేలా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: వేడుకలు జరిగే రాజ్‌పథ్‌కు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ఈ మార్గం చుట్టూ 80,000 మంది పోలీసులతో పాటు 10,000 మంది పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నారు. వేదికపై వీవీఐపీ ఎన్‌క్లోజర్ చుట్టూ ఏడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గగనతలాన్ని రాడార్‌తో పర్యవేక్షించనున్నారు. ఒబామా భారత యాత్రను సుదీర్ఘ కాలం గుర్తుంచుకునేలా తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ చెప్పారు.
విద్యావేత్తల బోధనపై ఒప్పందం!
భారత్‌లోని విద్యా సంస్థల్లో అంతర్జాతీయ అధ్యాపకులు బోధించటానికి సంబంధించిన ఒప్పందం ఒబామా పర్యటన సందర్భంగా ఖరారయ్యే వీలుంది. ఐఐటీలు, సెంట్రల్ వర్సిటీలు వంటి కేంద్ర నిధులతో నడిచే విద్యా సంస్థలతో పాటు ‘ఎ’ గ్రేడ్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు విదేశాల నుంచి అత్యుత్తమ అధ్యాపకుల చేత బోధన అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమిది. మోదీ అమెరికా పర్యటనలో ప్రతిపాదించిన ‘గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ ఎకడమిక్ నెట్‌వర్క్స్’ కింద ఏటా వేయి మంది వరకూ అమెరికా విద్యావేత్తలను ఇక్కడ బోధించేందుకు పంపించటానికి ఆ దేశం అంగీకరించింది. కాగా,
దీపావళిని పురస్కరించుకుని అమెరికాలో దీపావళి పోస్టల్ స్టాంపును జారీ చేసేందుకు ఒబామా పర్యటన సందర్భంగా మద్దతివ్వాలని కోరుతూ అమెరికా పార్లమెంటు సభ్యురాలు కారొలిన్ మాలొనీ ఆయనకు లేఖ రాశారు.