స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లో వైఫై వేగం పెరగనుందా..?
న్యూయార్క్: మీరు వైఫైను ఉపయోగిస్తున్నారా? అది స్లోగా ఉంటోందా? ఇక మీ నెట్ కష్టాలు తీరిపోయినట్టే! భారత సంతతి చెందిన వ్యక్తి తాజా పరిశోధన టెలీకమ్యూనికేషన్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ఐఐటీ-మద్రాసు నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పట్టా పొందిన కృష్ణరామస్వామి.. ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన నాన్ రెసిప్రోకల్ సర్కులేటర్, ఫుల్ డూప్లెక్స్ రేడియోలను నానో స్కేల్ సిలికాన్ చిప్ లతో అనుసంధానించడం ద్వారా వేగంగా సమాచారాన్ని పంపే సిస్టంను కనుగొన్నారు.
మొదటిసారి ఒక సర్కులేటర్ను సిలికాన్ చిప్తో అనుసంధానించామని, దీని ద్వారా మునుపటి కంటే అత్యుత్తమ పనితనాన్ని మనం గమనించవచ్చని ఆయన అన్నారు. గత సంవత్సరం కొలంబియా పరిశోధకులు ఫుల్ డూప్లెక్స్ రేడియో ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ టెక్నాలజీని ఆవిష్కరించారు. దాని ఫలితంగా ఒకే ఫ్రీక్వెన్సీ వద్ద ట్రాన్స్మిషన్, రిసెప్షన్లతో వైర్ లెస్ రేడియోలను వినియోగించడానికి అవకాశం ఏర్పడింది. రెండు యాంటెనాల సాయంతో ఒకే ఫ్రీక్వెన్సీతో సమాచారాన్ని చేరవేయడం సులభతరమయింది. ప్రస్తుత పరిశోధన వల్ల వైఫై టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఒకే యాంటెనా సాయంతో వైఫై కెపాసిటీని డబుల్ చేయడం వల్ల స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది.
ఒకే చిప్ మీద సర్కులేటర్ను ఉంచడం వల్ల మిగిలిన రేడియో భాగాలు సైజులో బాగా తగ్గిపోయి పనితనం పెరిగిందని మరో పరిశోధకుడు జిన్ జోహు వివరించారు. ఈ విజయాన్ని సాధించడానికి కృష్ణస్వామి టీమ్ లారెంజ్ రెసిప్రోసిటీను బ్రేక్ చేయవలసి వచ్చింది (ఎలక్ర్టోమ్యాగ్నటిక్ ఫోర్సెస్ ముందుకు, వెనుకకు ఒకే సమయంలో ప్రయాణించేలా చేయాల్సి వచ్చింది). భావి తరాలకు చెందిన గ్రాడ్యుయేట్లకు ఇటువంటి పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని భారత సంతతికి చెందిన మరో ఇంజనీర్ తెలిపారు. 2016 ఐఈఈఈ నిర్వహించిన ఇంటర్నేషనల్ సాలిడ్ స్టేట్ సర్కూట్స్ కాన్ఫరెన్స్లో ఈ పేపర్ను ప్రచురించారు.