
ఐరాసలో జడ్జిగా భారత మహిళ
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితిలో మరో భారతీయురాలికి ఉన్నత పదవి దక్కింది. సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ(ఐటీఎల్‌ఓఎస్)కు భారత్‌కు చెందిన న్యాయ నిపుణురాలు నీరు చాధా ఎన్నికయ్యారు. ఈ ట్రిబ్యునల్‌కు జడ్జిగా నియమితులైన తొలి భారత మహిళ ఆమెనే కావడం విశేషం.
చాధా ఈ పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ప్రముఖ లాయర్ అయిన చాధా విదేశాంగ శాఖలో ముఖ్య న్యాయ సలహాదారుగా పనిచేసిన తొలి మహిళగా పేరుగాంచారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో చాధాకు ఆసియా పసిఫిక్ గ్రూప్‌లో అత్యధికంగా 120 ఓట్లు రావడంతో అమె తొలి రౌండ్‌లోనే గెలుపొందారు. ఈ పదవికి పోటీపడిన ఇండోనేషియా అభ్యర్థికి 58 ఓట్లు, లెబనాన్ వ్యక్తికి 60, థాయిలాండ్ అభ్యర్థికి 86 ఓట్లు దక్కాయి. ఈ ట్రిబ్యునల్‌లో మొత్తం 21 మంది సభ్యులుంటారు.చాధాకు మద్దతిచ్చిన దేశాలకు యూన్‌లో శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.