
ఆయుధ దిగుమతుల్లో భారత్ టాప్
తర్వాతి స్థానాల్లో చైనా, పాకిస్థాన్ స్వీడన్ సంస్థ ‘సిప్రి’ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కన్నా ముందుంది. ఆ దేశాల కన్నా మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
ఈ ప్రకారం... భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానం దక్కించుకుంది.
భారత్‌కు ఆయుధాల విక్రయంలో అమెరికా రెండో స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అదే కాలంలో పాకిస్థాన్ ఆయుధ సంపత్తిలో 27 శాతం అమెరికానే అందించడం గమనార్హం. అయితే చైనా మాత్రం భారత ఉపఖండంలో ముఖ్యమైన ఆయుధాల విక్రయదారుగా వ్యవహరిస్తోంది. పాకిస్థాన్ ఆయుధాల దిగుమతుల్లో 54 శాతం, బంగ్లాదేశ్ ఆయుధాల దిగుమతుల్లో 82 శాతం సరఫరా చేసింది. ఇలా దక్షిణాసియాకు ఆయుధాల సరపరా ద్వారా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి అమెరికా, చైనా ప్రయత్నిస్తున్నాయని సిప్రి తన నివేదికలో పేర్కొంది. భారత్ మాత్రం తన సైనిక అవసరాలకు స్వదేశీ తయారీ పరిశ్రమ కన్నా ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ప్రస్తావించింది.