అమెరికా ఫస్ట్, భారత్ సెకండ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి గతేడాదికిగాను 1760 కోట్ల డాలర్ల సరకులను, సేవలను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఎప్పటిలాగే ఈ విషయంలో అమెరికానే అగ్రస్థానంలో నిలవగా భారత్ రెండో స్థానంలో నిలవడం విశేషం. అమెరికా 160 కోట్ల డాలర్ల సరకులను, సేవలను ఐక్యరాజ్యసమితికి అందించగా, భారత్ 120 కోట్ల డాలర్ల సరకులను, సేవలను అందించింది.
ఈ విషయంలో తొలి పది స్థానాల్లో అమెరికా, యూరప్ దేశాలు ఉండడం సహజమే అయినప్పటికీ భారత్ లాంటి వర్ధమాన దేశాలు, కెన్యా, లెబనాన్, అఫ్ఘానిస్థాన్, టర్కీ, ఇథియోపియా లాంటి వెనకబడిన దేశాల నుంచి సమితికి ఎగుమతులు పెరగడం ఆశ్చర్యకరం.
2005లో ప్రారంభమైన ఈ కొత్త ట్రెండ్ 2015 నాటికి కూడా కొనసాగింది. ఎక్కువ సరకులను, సేవలను అందించిన టాప్ పది దేశాల్లో అమెరికా, భారత్ ప్రథమ, ధ్వితీయ స్థానాల్లో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, స్విడ్జర్లాండ్, బెల్జియం, అఫ్ఘానిస్థాన్, డెన్మార్క్, ఫ్రాన్స్, యుకె, కెన్యా దేశాలు నిలిచాయి. ముడి సరుకులు కాకుండా 13 సెక్టార్లలో ఐక్యరాజ్య సమితి సరకులను, సేవలను దిగుమతి చేసుకుంటుంది.
ఆరోగ్యం, రవాణా, అడ్మినిష్ట్రేషన్, ఆపరేషన్, భవన నిర్మాణం, ఇంజనీరింగ్, ఆహారం, విద్యా, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, మానవతా సాయంచ, సరకులు, ఇతర సేవలు ఈ సెక్టార్లలో ఉన్నాయి. సమితి దిగుమతి చేసుకునే ఎగుమతుల్లో ఆరోగ్య రంగానిదే పెద్ద పీట. మొత్తం దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో 23 శాతం ఆరోగ్య రంగానిదే (ఔషధాలు, వైద్య పరికరాలు).