అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఇర్మా హరికేన్ ధాటికి వేల సంఖ్యలో తెలుగు కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఒక్క ఫ్లోరిడాలోనే దాదాపు ఆరు వేల వరకు తెలుగు కుటుంబాలున్నాయి. తీర ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి అధికారులు ప్రజలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిరాశ్రయు లైన తెలుగు ప్రజలకు ఇతర రాష్ట్రాలు, నగరాల్లోని తెలుగువారు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడా నుంచి దాదాపు వెయ్యి తెలుగు కుటుం బాలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది.
అక్కడి తెలుగు సంఘాలు అప్రమత్తమై ఇర్మా బాధితుల్లో ఉన్న తెలుగువారి జాడ కోసం ప్రయత్నిస్తున్నాయి. సమీపంలోని ఇతర నగరాల్లో ఉన్న తెలుగువారితో సంప్రదించి వీలైనంత ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించేలా చూస్తున్నాయి. ఇక వేరే నగరాల్లోని స్నేహితులు, బంధువుల వద్దకు వెళ్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్ రిక్ స్కాట్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత కేంద్రాల్లో దాదాపు 50 వేల మంది వరకు తలదాచుకుంటున్నారు. ఇందులో కొన్ని తెలుగు కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రాణనష్టం లేకుండా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది.