Sister Lissy Chakkalakkal: ఈ స్కూల్లో పిల్లలకు ఇళ్లులేకపోతే టీచర్లే ఇళ్లు కట్టిస్తారంట!! | Kerala School Principal Build 150 Houses For The Homeless Students In 7 Years | Sakshi
Sakshi News home page

ఇళ్లు లేని విద్యార్థులకు ఏకంగా 150 ఇళ్లు కట్టించన టీచర్‌.. ఎక్కడంటే..

Published Tue, Sep 21 2021 11:07 AM | Last Updated on Tue, Sep 21 2021 5:11 PM

Kerala School Principal Build 150 Houses For The Homeless Students In 7 Years - Sakshi

కొందరు టీచర్లు స్టూడెంట్స్‌ పట్ల దయతో బుక్స్‌ కొనిస్తారు. బూట్లు కొనిస్తారు. ఫీజులు కడతారు. బట్టలు కుట్టిస్తారు. కాని కేరళలో ఈ టీచర్‌ కథ వేరు. ఆమె ఏకంగా ఇల్లే కట్టించి ఇస్తుంది. ఇది నిజం. గత 7 సంవత్సరాలలో 150 ఇళ్లు స్టూడెంట్స్‌కు కట్టి ఇచ్చింది. టీచర్ల విశాలమైన మనసుకు గిన్నెస్‌ రికార్డు ఉంటే అది ఈమెకే దక్కుతుంది.

ఒక టీచర్‌గా పని చేస్తే ఆ టీచర్‌కు ఒక సైన్యం తయారవుతుందని ‘సిస్టర్‌ లిజీ చక్కలకల్‌’ను చూస్తే అర్థమవుతుంది. కొచ్చిలో ‘అవర్‌ లేడీస్‌ గర్ల్స్‌ స్కూల్‌’ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఈ 53 ఏళ్ల నన్‌ తన విద్యార్థినులపై కురిపిస్తున్న దయ అసామాన్యమైనది. 2012 నుంచి నేటి వరకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె తన విద్యార్థినుల కోసం మొత్తం 150 ఇళ్లు కట్టించింది. ప్రభుత్వమో, వ్యవస్థో, సంస్థో చేయాల్సిన పని కేవలం ఒక టీచర్‌గా ఆమె సాధించింది. ఎలా? ఎందుకు?

ఇంటికి వెళ్లి చూడాలి
త్రిశూర్‌లో ఎనిమిది మంది సంతానంలో ఒకదానిగా జన్మించిన లిజీ మిగిలిన తోబుట్టువులందరూ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్‌ అవగా తాను మాత్రం దైవ మార్గంలో మానవ సేవ చేయడానికి అంకితమైంది. కేరళలోని ‘ఫ్రాన్సిస్కన్‌ మిషనరీస్‌’లో సభ్యురాలయ్యి తమ మిషనరీ నడిపే స్కూలు ఉపాధ్యాయనిగా పని చేయడం మొదలెట్టింది. కాని టీచర్‌ పని కేవలం పాఠాలు చెప్పడం కాదు. విదార్థికి సంబంధించిన బాగోగులు కూడా గమనించడం. అందుకే లిజీ స్కూల్‌ అయ్యాక ‘విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలించే’ కార్యక్రమాన్ని స్వీకరించింది. కాని ఆ పరిశీలనలు ఆమెను విపరీతంగా డిస్టర్బ్‌ చేశాయి. 

‘చాలామంది విద్యార్థినులకు అసలు ఇళ్లే లేవు. చాలామంది ఒక్క గది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వయసొచ్చిన అమ్మాయిలకు చాటు లేదు. భద్రత లేదు. వీరికోసం ఏదైనా చేయాలి అనిపించింది’ అంటుంది లిజీ. 2012లో ఒక విద్యార్థిని ఇంటికెళితే ఆ విద్యార్థిని కుటుంబం ఒక పాలిథిన్‌ షీట్‌ కప్పుతో ఉన్న గుడిసెలో జీవిస్తున్నట్టు ఆమె గమనించింది. తాగుడు వల్ల తండ్రి చనిపోగా తల్లి పిల్లలను సాకుతోంది. ఆ స్థలం వారిదే అని తెలుసుకుని అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఆమె సంకల్పం తీసుకుంది.

2014 నుంచి హౌస్‌ ఛాలెంజ్‌
అందరూ మొక్కలు నాటే ఛాలెంజ్, ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ లాంటివి చేస్తుంటే లిజీ ‘హౌస్‌ ఛాలెంజ్‌’ తీసుకుంది. అవును. ఇల్లు లేని తన విద్యార్థినులకు ఇల్లు కట్టించే ఛాలెంజ్‌ అది. కాని అందుకు డబ్బు? ఇక్కడే ఆమెకు తన ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఒక సైన్యంగా పనికొచ్చారు. ‘మా స్కూల్‌లో చదువుకునే విద్యార్థినులు వారానికి ఒకసారి ఒక రూపాయి డొనేట్‌ చేయాలి. అలాగే పుట్టినరోజులు జరుపుకోకుండా అందుకు అయ్యే ఖర్చును డొనేట్‌ చేయాలి. ఆ డబ్బును ఇల్లు కట్టేందుకు ఉపయోగిస్తాను. 

అంతే కాదు... మా పూర్వ విద్యార్థులను సహాయం అడుగుతాను. ఊళ్లోని దాతలను సంప్రదిస్తాను. నా ఉద్దేశంలోని నిజాయితీని అర్థం చేసుకుని అందరూ సాయం చేస్తారు. అంతెందుకు.. నేను ఇల్లు కట్టివ్వమంటే మేస్త్రీలు కూడా తక్కువ కూలి తీసుకుని పని చేస్తారు. అలా ఒక్కో ఇల్లు కట్టుకుంటూ వస్తున్నాను’ అంటుంది లిజీ. అయితే ఆ ఇళ్లు హల్కాడల్కా ఇళ్లు కాదు. కచ్చితమైన మంచి రూపం, నాణ్యత ఉంటాయి. ఒక సెంట్‌ లేదా రెండు సెంట్ల స్థలంలో 500 చ.అడుగుల నుంచి 600, 700 చదరపు అడుగుల ఇళ్లను ఆమె కట్టి ఇస్తుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఒక్కో ఇంటికి వెచ్చిస్తుంది.

ఎలా ఎంపిక?
సరే. ఒక స్కూల్లో ఎంతో మంది విద్యార్థినులకు సొంత ఇల్లు ఉండదు. మరి సిస్టర్‌ లిజీ ఎవరికి ప్రాధాన్యం ఇస్తుంది అనంటే దానికి ఆమె ఒక పద్ధతి పెట్టుకుంది. ‘నేను కట్టిచ్చే ఇళ్లు చాలామటుకు వితంతు స్త్రీలకు అయి ఉంటాయి. లేదా భర్త మంచం పట్టి పిల్లలు దివ్యాంగులు అయితే వారికి ప్రాధాన్యం ఇస్తాను. దారుణమైన పేదరికంలో ఉంటే వారికి కట్టి ఇస్తాను. వారి పరిస్థితులు చూడగానే మనకు తెలిసిపోతుంది ఇళ్లు కట్టించి ఇవ్వాలా వద్దా అని’ అంటుందామె. లిజీ కట్టించి ఇచ్చే ఇళ్లలో హాల్, కిచెన్, షాపు పెట్టుకుని బతకాలంటే ఆ ఇంటిలోనే వీధిలోకి ఒక గది ఇలా ప్లాన్‌ చేసి కట్టి ఇస్తుంది. ‘ఈ దేశంలో ఇల్లు లేని వారే ఉండకూడదు అని నా కోరిక’ అంటుంది సిస్టర్‌ లిజీ.

స్థలాలు కూడా ఇస్తున్నారు
సిస్టర్‌ లిజీ ఇంత వరకూ స్థలాలు ఉండి అక్కడ ఇళ్లు కట్టుకోలేని వారికి ఇల్లు కట్టి ఇచ్చేది. ఇప్పుడు ఆమె ప్రయత్నం చూసి స్థలదాతలు కూడా ముందుకు వస్తున్నారు. ‘మేము భూమి ఇస్తాం. మీరు పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వండి’ అని ఇస్తున్నారు. తాజాగా రంజన్‌ వర్గీస్‌ అనే దాత 70 సెంట్ల స్థలం దానం చేస్తే సిస్టర్‌ లిజీ ఆ స్థలంలో 12 ఇళ్లు కట్టించి తన పేద విద్యార్థినులకు ఇచ్చింది. సొంత ఇంటిలో అడుగుపెట్టేటప్పుడు ఆ కుటుంబాల కళ్లల్లో కనిపించే ఆనందం వర్ణనకు అతీతం. ఆ విద్యార్థినులు సిస్టర్‌ లిజీని సాక్షాత్తు దైవదూతలా చూస్తారు.

ఇంతకాలం గురుదక్షిణ గురించి విన్నాం. కాని సిస్టర్‌ లిజీ సేవ చూస్తే గురుదక్షిణ అనేది చిన్నమాట అనిపిస్తుంది. ఇలాంటి గురువులకు ఎటువంటి దక్షిణ ఇవ్వలేం. కాని ఈ స్ఫూర్తిని కొనసాగించి చేయగలిగిన శక్తి వచ్చినప్పుడు ఇలా లేని వారికి గూడు ఏర్పాటు చేయడమే అసలైన గురుదక్షిణగా భావిస్తే లిజీ ఆశించినట్టు ఇళ్లు లేనివారే ఉండని రోజు తప్పక వస్తుంది.

చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్‌ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement