యాపిల్ కార్లూ వచ్చేస్తున్నాయి!!
బెంగళూరు: ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు విక్రయించే ప్రఖ్యాత యాపిల్ సంస్థ త్వరలోనే ఆటోమొబైల్ రంగంలోకి దిగనుందా? ప్రజలను త్వరలోనే యాపిల్ కార్లు పలుకరించనున్నాయా? అంటే ఆ కంపెనీ తాజాగా నమోదు చేసిన వెబ్‌సైట్ డొమైన్ పేర్లు ఔననే అంటున్నాయి. యాపిల్ సంస్థ గత డిసెంబర్‌లో కొన్ని డొమైన్ పేర్లను తన పేరిట నమోదుచేసుకుంది. అందులో యాపిల్.కార్, యాపిల్.కార్స్, యాపిల్.ఆటో వంటి పేర్లు ఉన్నాయని డొమైన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ అయిన 'వూ.ఈజ్' తెలిపింది.
అయితే ఈ డొమైన్లు యాపిల్ కారు ప్లే సర్వీసుకు చెందినవి కూడా కావొచ్చునని వినిపిస్తోంది. కారు నడిపించేటప్పుడు స్టీరింగ్ వీల్ నుంచి చేతులు తీయకుండానే ఐఫోన్‌లో కాల్స్, వాయిస్ మెయిల్స్ వినేందుకు వినియోగదారులకు ఈ సర్వీసు వీలు కల్పిస్తుంది. మరోవైపు ఆటో మొబైల్ రంగం నిపుణులను పెద్ద ఎత్తున కంపెనీలో చేర్చుకుంటున్న యాపిల్.. తనకు కారును రూపొందించే ఆలోచన ఉందని మాత్రం బహిరంగంగా ఒప్పుకోవడం లేదు. అయితే, ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను చేర్చుకోవడం ద్వారా యాపిల్ ఉద్దేశం ఏమిటో అర్థమవుతూనే ఉంది. సిలికాన్ వ్యాలీకి చెందిన గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పుడు కారు టెక్నాలజీ మీదనే ప్రధానంగా దృష్టి సారించాయి. గూగుల్ ఇప్పటికే తనకుతాను నడుపుకొనే సెల్ఫ్ డ్రైవింగ్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.