
(హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో): జీఈఎస్ సదస్సులో ప్రసంగించినప్పుడు ఇవాంకా ట్రంప్ ముగ్గురు మహిళల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాల నుంచి అవకాశాలను అందిపుచ్చుకుని ఎలా ఎదిగారన్నది వివరించారు. వారు మన ఆకాంక్షలకు ప్రతిరూపమని చెప్పారు. ‘‘సమస్యలకు వెరవకుండా ధైర్యంగా ముందుకు సాగే మీ లాంటి ఎంట్రప్రెన్యూర్ల ఆకాంక్షలు, దార్శనికతకు వీరంతా ప్రతీకలు. వారు అనేక జీవితాలను నిలబెడుతున్నారు. ఉపాధి కల్పిస్తున్నారు. ఆశాజ్యోతులుగా నిలుస్తున్నారు. మహిళలు, పురుషులనే భేదం లేకుండా అంతా కలసి.. ఏకమై సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఆ దిశగా పాటుపడదాం. అలా చేస్తే మెరుగైన భవిష్యత్తు మనదే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మన భవిష్యత్‌ను సమైక్యంగా తీర్చిదిద్దుకోగలిగే సత్తా మనలో ఉంది.’’అని ఇవాంకా స్పష్టం చేశారు. ఆమె చెప్పిన ముగ్గురిలో బెంగళూరుకు చెందిన మహిళ కూడా ఉండడం గమనార్హం. ఆ ముగ్గురి గురించీ ఇవాంకా మాటల్లోనే..
దారా డోట్జ్.. శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)
దారా దశాబ్దకాలంపైగా ప్రపంచవ్యాప్తంగా బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. వారు ఎదుర్కొనే చిన్న చిన్న కష్టాలను ఆమె దగ్గర్నుంచి చూశారు. నీళ్లు తెచ్చుకునేందుకు అవసరమైన వస్తువులు లేకపోవడం దగ్గరి నుంచి.. దెబ్బతగిలితే కనీసం కట్టుకట్టేందుకు సరైన సాధనం లేకపోవడం దాకా అనేక సమస్యలను దగ్గరి నుంచి పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రాణాధారమైన అనేక ఉత్పత్తులను త్రీడీ ప్రింటింగ్ ద్వారా రూపొందించే ఫీల్డ్ రెడీ సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎక్కడ ఏ విపత్తు ముంచుకొచ్చినా.. ఫీల్డ్ రెడీ సంస్థ వెంటనే రంగంలోకి దిగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ తోడ్పాటుతో సహాయక చర్యలు అందిస్తుంది. వినూత్న ఆవిష్కరణల ద్వారా దారా డోట్జ్ అనేకమంది జీవితాలను నిలబెడుతున్నారు. అందరికీ ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు.
రాజ్యలక్ష్మి బొర్థాకుర్, బెంగళూరు
చిన్న వయసులోనే కుమారుడు ఫిట్స్ బారిన పడటం రాజ్యలక్ష్మిని కలచివేసింది. కుమారుడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు ఉపయోగపడే పరిష్కార మార్గాన్ని సొంతంగానే కనుగొనాలని ఆమె నిర్ణయించు కున్నారు. ఆ క్రమంలోనే ఆమె ‘స్మార్ట్ గ్లోవ్స్’ను రూపొందించారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా వివిధ రకాల వ్యాధులను, రుగ్మతలను ఈ పరికరం ముందస్తుగానే అంచనా వేస్తుంది. రోగులను హెచ్చరిస్తుంది కూడా. ప్రస్తుతం రాజ్యలక్ష్మి నెలకొల్పిన ‘టెరా బ్లూ’సంస్థ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా కృషి చేస్తోంది.
రేహాన్ కెమలోవా, అజర్‌బైజాన్
రేహాన్ వయసు కేవలం పదిహేనేళ్లే. కానీ వర్షపునీటి నుంచి విద్యుత్ తయారు చేసే సంస్థను ఏర్పాటు చేసిన ఘటికురాలు ఆమె. ఒక్కొక్కటిగా మొదలుపెట్టి ప్రపంచంలోని ప్రతి ఇంట్లో విద్యుత్ కాంతులు నింపాలన్నది రేహాన్ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment